Markapur: కూరగాయల మొక్కల మధ్యనే చీకటి యవ్వారం.. ఆ ఇంటికి వెళ్లి చెక్ చేసిన పోలీసుల షాక్
గ్రామీణ ప్రాంతాల్లో గుప్పుమంటోంది. మత్తు పదార్థాలకు యువకులు బానిసలుగా మారుతున్నారు. గంజాయి దొరకడం టఫ్ అవ్వడంతో .. ఇళ్లలోనే పెంపకం షురూ చేస్తున్నారు కొందరు.
ఆ గట్టున..ఈ గట్టున ..గంజాయి గుప్పుమంటోంది. పొడి..తడి..లిక్విడ్ నానా రూపాల్లో సరిహద్దులు దాటేస్తోంది సరుకు. ఎంత నిఘా పెట్టిన గంజాయి మాఫియాకు మాత్రం కళ్లెం పడ్డంలేదు. ఇది కాదనలేని నిజమే. డ్రగ్స్ డాన్‌లను మించిపోతున్నారు గంజాయి స్మగర్లు, పుష్ప సినిమా ప్రభావమో.. లేక డగ్స్ డాన్ వెబ్‌సిరీస్ ఎఫెక్టో తెలియదు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారుల మూకుమ్మడి దాడులు, తనిఖీలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న స్మగర్లు, గంజాయి మత్తు గాళ్లు.. ఇళ్లల్లోనే దుకాణం పెట్టేస్తున్నారు. పెరట్లోనే గంజాయిని పూల మొక్కల్లా పెంచేస్తున్నారు.
తాజాగా మార్కాపురం పట్టణంలో ఓ ఇంట్లో పోలీసులు గంజాయి మొక్కల్ని గుర్తించడం కలకలం రేపింది. మార్కాపురం పట్టణంలోని బాపూజీ కాలనీలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం కావడంతో సిబ్బందితో కలిసి దాడి చేయగా గంజాయి మొక్కలు వెలుగు చూశాయి. అనంతరం SEB పోలీసులకు సమాచారం అందించగా వారు సైతం సంఘటన స్థలానికి చేరుకొని గంజాయి మొక్కలుగా నిర్ధారించుకున్నారు. దాసరి దానమ్మ, దాసరి పేరయ్య ఇంట్లో సాగు చేస్తున్న మూడు గంజాయి మొక్కలను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కనిగిరి శివ అనే ప్రధాన అనుమానితుడు పోలీసుల రాకతో పరారయ్యారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని ఓ ఇంట్లోనే గంజాయి మొక్కల సాగు వెలుగు చూడటంతో పోలీసులు సైతం నివ్వెర పోయారు. ఈ గంజాయి మొక్కల ద్వారా సేకరించిన గంజాయిని కాలేజీ విద్యార్థులకు, యువతకు పంపిణీ చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.
గంజాయిపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయిన ప్రభుత్వం.. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంతో ఏజెన్సీ వాసుల్లో చైతన్యం తీసుకొచ్చింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి గంజాయి సాగు చట్ట వ్యతిరేకం అని చాటిచెప్పారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని.. ప్రభుత్వం సబ్సిడీ కింద విత్తనాలు ఇస్తుందని భరోసా ఇచ్చారు. దీంతో గిరిజనులు గంజాయి సాగును వదిలేశారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ మత్తు యవ్వారం సీక్రెట్‌గా నడుస్తూనే ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..