Andhra Pradesh: పేదల బియ్యాన్ని అమ్ముకుని పరువు పోగొట్టుకున్న సివిల్ సప్లయిస్ అధికారి.. వీడియో

ఆయనో బాధ్యత కలిగిన సివిల్ సప్లయ్ అధికారి. రెక్కాడితే గానీ డొక్కాడనే పేదలు కాసిన్ని గంజినీళ్లు తాగేందుకు ఆధారపడే రేషన్ బియ్యంపైనే కన్నేశాడు. అడ్డగోలుగా అవినీతికి పాల్పడి భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టించాడు. చివరాకరికి అతగాడి పాపం పండి అధికారులకు చిక్కాడు..

Andhra Pradesh: పేదల బియ్యాన్ని అమ్ముకుని పరువు పోగొట్టుకున్న సివిల్ సప్లయిస్ అధికారి.. వీడియో
Puttur Deputy Tehsildar Of Civil Supplies
Follow us
Raju M P R

| Edited By: Srilakshmi C

Updated on: Nov 06, 2024 | 10:09 AM

తిరుపతి, నవంబర్‌ 6: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. ఏకంగా రూ.30 లక్షల విలువైన రేషన్ బియ్యం అమ్ముకున్న ఒక అధికారి నిర్వాకం బట్ట బయలైంది. దాదాపు 5 వేల బస్తాల రేషన్ బియ్యం సొంత అవసరాలకు వాడుకొని విలాసవంతమైన జీవితాన్ని గడిపిన సివిల్ సప్లై డిటి సిహెచ్ విష్ణు అరెస్టుతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పుత్తూరు సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహాసిల్దార్ విష్ణును అరెస్ట్ చేసిన పోలీసులు.. పుత్తూరు పౌరసరఫరాల శాఖ గోదాము నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలించినట్లు తేల్చారు. పుత్తూరు పిచ్చాటూరు మండల లెవెల్ స్టాక్ పాయింట్స్ నుంచి దాదాపు 5040 రేషన్ బియ్యం బస్తాలను అక్రమంగా విక్రయించినట్లు దర్యాప్తులో గుర్తించారు.

2022 డిసెంబర్ నుంచి 2024 ఆగస్టు వరకు పుత్తూరు, పిచ్చాటూరు ఎంఎల్ఎస్ పాయింట్స్ అధికారిగా పనిచేసిన సీహెచ్ విష్ణుపై పలు ఫిర్యాదులు రావడంతో శాఖాపరమైన విచారణ చేపట్టిన జిల్లా యంత్రాంగం ఈ మేరకు అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దీనిలో భాగంగా లోతైన దర్యాప్తు చేపట్టి.. సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ సిహెచ్ విష్ణుపై ఫిర్యాదు చేసింది. విష్ణుపై ఆహార భద్రత చట్టం-1955 ప్రకారం 314, 316, 316(5), 318(4),7(1) ఇలా పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో సీహెచ్ విష్ణును అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

నగరి, ఏర్పేడు, కడపకు చెందిన కొందరు బియ్యం వ్యాపారులతో చేతులు కలిపి రేషన్ బియ్యం అమ్మకాలు సాగినట్టు పోలీసులు గుర్తించారు. పుత్తూరు సివిల్ సప్లయిస్ గోదాము నుంచి రూ 14.90 లక్షల విలువైన 2840 బస్తాలు, పిచ్చాటూరు ఎంఎల్ఏస్ పాయింట్ నుంచి రూ 14.80 లక్షల విలువైన 2200 బస్తాల రేషన్ బియ్యం విక్రయించినట్లు విచారణలో వెల్లడించారు. అప్పులు విలాసాలకు అలవాటు పడి అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో కడప, నగరి, ఏర్పేడు బియ్యం వ్యాపారుల భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్‌లో మరో పౌర సరఫరాల శాఖ అధికారి కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని విక్రయించి అక్రమ సంపాదనకు పాల్పడిన సివిల్ సప్లైస్ డిటీ సీహెచ్ విష్ణు నెల్లూరు, చెన్నై, గూడూరులోని కొందరి వ్యక్తుల వద్ద అప్పులు కూడా చేసినట్లు తేల్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.