క్షణక్షణం.. భయం భయం. పులులు ఎటువైపు నుంచి వచ్చి ఎటాక్ చేస్తాయోనన్న టెన్షన్.. 24గంటలు గడిచిన పులుల జాడ తెలియక పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు పల్నాడు జిల్లా ప్రజలు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. భయటకు పోవాలంటే జంకుతున్నారు. ఇక పులుల సంచారంతో అలర్ట్ అయ్యారు వినుకొండ, మాచర్ల ఫారెస్ట్ రేంజ్ అధికారులు. బొల్లాపల్లి మండలంలో అధికారుల విస్తృత ప్రచారం చేస్తున్నారు. గంగిగనముల గ్రామంలో ప్రజలను అలర్ట్ చేశారు. పులుల జాడ గుర్తించే తెలిసేవరకు బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. పశువుల కాపర్లు ఒక్కోక్కరు వెళ్లవద్దని.. గుంపులుగా వెళ్లాలని సూచించారు.
అడవి నుంచి బయటకు వచ్చిన పులులు.. గండిగనముల వైపు వెళ్లే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. వినుకొండ, మాచర్ల ఫారెస్ట్ రేంజ్‌లలోఅటవీశాఖ అప్రమత్తమైంది. పులులను గుర్తించేందుకు వినుకొండ పరిధిలో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. అయినప్పటికీ.. ఏ కెమెరాలోనూ పులుల జాడ కనిపించడం లేదు. దాంతో పల్నాడు జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పులులు ఎటువైపు నుంచి వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ నల్లమల టైగర్ రిజర్వ్ నుంచి దారితప్పించుకొని పల్నాడులోకి ఎంట్రీ ఇచ్చాయి టైగర్స్. ఈమధ్య కాలంలో అభయారణ్యంలో పులుల సంతతి వృద్ధి చెందింది. వాటి సంఖ్య 73కు చేరింది. పులుల సంచారానికి ఆ ప్రాంతం సరిపోక పోవడంతో జనావాసాల్లోకి వస్తున్నాయి.
కాగా, అడవి నుంచి బయటకు వచ్చిన పులు.. జీవాలపై దాడులు చేస్తున్నాయి. జిల్లాలోని గజాపురంలో ఒక అవుపై పులి దాడి చేసి చంపిందని స్థానికులు ఫిర్యాదునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుర్గి మండలం గజాపురం, రాజానగరం పంచాయతీల్లో పులి అడుగు జాడలు గుర్తించారు. ఇవి పులులే తప్ప మ్యాన్ ఈటర్స్ కాదని చెబుతున్నారు అధికారులు. ఒకవేళ పులుల ఆనవాళ్లు కనిపిస్తే చెప్పాలని, వీలైనంత త్వరగా పట్టుకుంటామని భరోసా కూడా ఇస్తున్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ అభయారణ్యంలో పులుల సంతతి వృద్ధి చెంది వాటి సంఖ్య 73కు పెరిగిందని వినుకొండ రేంజి అధికారి సయ్యద్ హుస్సేన్ తెలిపారు. దీంతో సంచారానికి ఆ ప్రాంతం సరిపోక సరిహద్దునున్న పల్నాడు జిల్లా అటవీ ప్రాంతంలోకి రెండు పులులు ప్రవేశించాయని వెల్లడించారు. బుధవారం ప్రమాదవశాత్తు మృతి చెందిన జింక పోస్టుమార్టం కోసం స్థానిక పశువైద్యశాలకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం దుర్గి మండలంలో పులులు సంచరిస్తున్నాయని బొల్లాపల్లి, కారంపూడి ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉన్నందున స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు. అవి మనుషులను తినేవి కాదని వాటిని గందరగోళం చేసి ఇబ్బంది పెట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ 44 వేల చ.కి.మీ. అటవీప్రాంతం ఉన్నందున కంచె వేయలేమని, జంతువులు బయటకు రాకుండా గుంతలు ఏర్పాటు చేసి నీళ్లు పోయిస్తున్నట్లు చెప్పారు. బొల్లాపల్లి, నాయుడుపాలెం, ఈపూరు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం ఎక్కువ ఉన్నట్లు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..