AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల పర్యటన.. సాంకేతికత, నాణ్యత ప్రమాణాలపై ఏమన్నారంటే..

పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణుల బృందం నాలుగు రోజుల పర్యటన ముగిసింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌, గ్యాప్‌-1, గ్యాప్‌-2 నిర్మాణ పనులను పరిశీలించిన నిపుణులు.. నిర్మాణ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాల ప్రభావం తక్కువగా ఉన్నందున పనుల వేగం పెంచాలని, నాణ్యతా పరీక్షల వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చిలో మరోసారి పోలవరాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు.

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల పర్యటన.. సాంకేతికత, నాణ్యత ప్రమాణాలపై ఏమన్నారంటే..
Polavaram Project
B Ravi Kumar
| Edited By: |

Updated on: Oct 18, 2026 | 8:08 AM

Share

ఏలూరు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన అంతర్జాతీయ నిపుణుల బృందం నాలుగు రోజుల పర్యటన ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముగిసింది. ఈ నెల 14 నుంచి 17 వరకు సుదీర్ఘంగా సాగిన ఈ పర్యటనలో నిపుణులు ప్రాజెక్టు అత్యంత కీలకమైన భాగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్ పనులతో పాటు గ్యాప్-1, గ్యాప్-2 నిర్మాణాల పురోగతిని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొత్తం 40 గంటల పాటు సాగిన ఈ పర్యటనలో నిపుణులు తమ సమయాన్ని ఎంతో వ్యూహాత్మకంగా వినియోగించుకున్నారు. ఇందులో 13 గంటల సమయాన్ని పూర్తిగా ప్రాజెక్ట్ సందర్శన, క్షేత్రస్థాయి పరిశీలనలకే కేటాయించగా, మిగిలిన 27 గంటల పాటు సుదీర్ఘమైన సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

ఈ అంతర్జాతీయ బృందంలో ప్రముఖ నిపుణులు రిచర్డ్ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్ హించ్‌బెర్గర్, డేవిడ్ పాల్ తదితరులు పాల్గొన్నారు. వరుసగా నాలుగు రోజుల పాటు జరిగిన ప్రతిష్టాత్మక సమావేశాలకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ సంజీవ్ వోహ్రా అధ్యక్షత వహించారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఏర్పాటు చేసిన నాణ్యతా నియంత్రణ పరీక్షా కేంద్రాలను నిపుణులు సందర్శించి, అక్కడ జరుగుతున్న వివిధ పరీక్షల విధానాన్ని నిశితంగా పరిశీలించారు. నిర్మాణ పనుల్లో అనుసరిస్తున్న సాంకేతికత, నాణ్యతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని వారు ప్రశంసించారు.

అయితే, ప్రస్తుతం వర్షాల ప్రభావం తక్కువగా ఉన్నందున పనుల వేగాన్ని మరింత పెంచాలని వారు అధికారులకు సూచించారు. అదే సమయంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, ప్రతి చిన్న పరీక్షా ఫలితాన్ని, వివరాలను రికార్డుల్లో పక్కాగా భద్రపరచాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది రానున్న గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు పడుతుండగా, దీనికి అనుగుణంగా వచ్చే ఏడాది మార్చి నెలలో మరోసారి పోలవరంలో పర్యటించనున్నట్లు నిపుణులు తెలిపారు.

ఈ పర్యటనను పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా, రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ కె. నరసింహమూర్తి అత్యంత సమన్వయంతో విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పర్యటనలో పాలుపంచుకున్న అంతర్జాతీయ నిపుణులతో పాటు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీపీఏ సభ్య కార్యదర్శి ఎం. రఘురాం, రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us