Chirri Balaraju: ఆదర్శ నేతల వారసుడిగా జనసేన ఎమ్మెల్యే.. అభిమానులు ఇచ్చిన కారును ఏం చేశారో తెలుసా..?

| Edited By: Balaraju Goud

Jul 03, 2024 | 7:51 PM

అభిమానులంటే అలా ఉండాలి. కార్యకర్తలంటే ఇలా ఉండాలి. మరి నాయకుడెలా ఉండాలి? అచ్చం ఆ ఎమ్మెల్యేలాగా ఉండాలి. ఏమిటంటా ఆయన గొప్పతనం? అంటారా.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆమ్యామ్యాలకు అలవాటుపడిన నేతలను చూస్తున్న మనకు అభిమానంతో ఇచ్చిన బహుమతిని కూడా తిరిగి ఇచ్చేసిన వ్యక్తిత్వం ఆయనది. ఎవరా ఎమ్మెల్యే? ఏమిటా గిఫ్ట్‌?

Chirri Balaraju: ఆదర్శ నేతల వారసుడిగా జనసేన ఎమ్మెల్యే.. అభిమానులు ఇచ్చిన కారును ఏం చేశారో తెలుసా..?
Mla Chirri Balaraju
Follow us on

అభిమానులంటే అలా ఉండాలి. కార్యకర్తలంటే ఇలా ఉండాలి. మరి నాయకుడెలా ఉండాలి? అచ్చం ఆ ఎమ్మెల్యేలాగా ఉండాలి. ఏమిటంటా ఆయన గొప్పతనం? అంటారా.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆమ్యామ్యాలకు అలవాటుపడిన నేతలను చూస్తున్న మనకు అభిమానంతో ఇచ్చిన బహుమతిని కూడా తిరిగి ఇచ్చేసిన వ్యక్తిత్వం ఆయనది. ఎవరా ఎమ్మెల్యే? ఏమిటా గిఫ్ట్‌?

వార్డు మెంబర్‌గా ఎన్నికైతే కూడా చాలు.. వాళ్ల హవా మామూలుగా ఉండదు. ఇక సర్పంచ్‌, ఎంపీపీ, జడ్పీటీసీగా ఎన్నికైతే వారి దర్పం చూసి తీరాల్సిందే..! ఇక నగరాల్లో కార్పొరేటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనధికారికంగా కార్ల కాన్వాయ్‌ని మెయింటెయిన్‌ చేస్తుంటారు. కార్పొరేషన్లలో కార్పొరేటర్‌ అంటే ఓ ఎమ్మెల్యేకు ఉన్నంత బిల్డప్‌ ఉంటుంది మరి. అలాంటిది ఏకంగా ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఊహించుకోండి అతని రేంజ్‌ ఏ లెవెల్‌లో ఉంటుందో. అదీ కూడా పోలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే..మాటలా?

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జనసేన తరుఫున ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడెప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలు నిరాడంబరంగా జీవించారని, అతని లాగే అక్కడక్కడా కొంత మంది ఆదర్శంగా జీవించిన ప్రజా ప్రతినిధులు ఉన్నారని వినటమే కానీ, నేటితరం అలాంటి వారిని చూడలేదు. ఇదిగో వాళ్ల వారసుడిగా ఇప్పుడు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిలిచారు.

ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి ఎవరూ ఊహించనంత సంపాదించిన వారు ఎందరో ఉన్నారు. తరాల దాకా కూర్చుని తిన్నా తరిగిపోని ఆస్తులు వెనకేసుకున్న వారూ ఉన్నారు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కిన వారెందరో ఉన్నారు. కానీ బాలరాజు లాంటి ఎమ్మెల్యేలు అరుదుగా ఉంటారు. అతని లాగే అతని నియోజకవర్గ జనసేన కార్యకర్తలు కూడా అందరు కార్యకర్తల్లాగా కాకుండా నలుగురికి ఆదర్శంగా నిలిచారు. అధికార ఎమ్మెల్యే చేత ఏదో ఒక పని చేయించుకోవటానికి చుట్టూ మూగే అభిమానులు, కార్యకర్తలను చూస్తుంటాం.. కానీ పోలవరంలోని జనసైనికులు మాత్రం తమ పంథా వేరని నిరూపించారు. పోలవరం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యకర్తలు అందరు కలిసి తలా ఇంత చందాలు వేసుకుని తమ ఎమ్మెల్యేకు ఓ కారును బహుమతిగా ఇస్తే, ఎంతో హుందాగా దాన్ని తిరస్కరించారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.

అభిమానంతో కార్యకర్తలు ఇచ్చిన బహుమతిని సున్నితంగా రిజెక్ట్‌ చేయటానికి ఈ ఎమ్మెల్యే దగ్గర అంతులేని సంపదేం మూలుగటం లేదు. అలా అని ఆయన ఆస్తిపరుడు కాదు. ఎమ్మెల్యే అయ్యాడే కానీ, అందరిలా అతి సామాన్యుడు. మరీ చెప్పాలంటే ఆయన ఓ గిరిజన నేత. ప్రజాసేవలో ఎప్పటి నుంచో ఉన్నారు. జనసేన పార్టీ తరుఫున పోలవరం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ వస్తున్నారు. ఆయన కాలిబర్‌ నచ్చి పవన్‌ కల్యాణ్‌ పోలవరం టికెట్‌ ఇచ్చారు. అంతే ఇక మిగతాదంతా హిస్టరీనే. ఆయన మీద అభిమానంతో గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఎంతగా శ్రమించారో.. ప్రజలూ అంతే ఆదరించారు. ఫలితంగా మొదటిసారి శాసనసభకు బాలరాజు ఎన్నికయ్యారు.

అయితే మిగతా ఎమ్మెల్యేల్లా బాలరాజుకు సొంత వాహనం లేదు. ప్రజా సమస్యలపై తిరగాలంటే ఇబ్బందిగా ఉందన్న సంగతి గమనించిన కార్యకర్తలు, అభిమానులు చందాలేసుకుని పది లక్షల దాకా పోగేశారు. ఆ మొత్తంతో డౌన్‌ పేమెంట్‌గా కట్టి ఏకంగా ఫార్చునర్‌ కారును కొని తమ ఎమ్మెల్యేకు గిఫ్ట్‌గా ఇచ్చారు. డౌన్‌ పేమెంట్‌ పోను మిగిలిన సొమ్మును ఎమ్మెల్యే వాయిదాల పద్ధతిలో కట్టుకోవాలని చెప్పారు. ఇది అస్సలు ఊహించని ఎమ్మెల్యే బాలరాజు మొత్తానికి వారి అభిమానం కాదనలేక కారెక్కి ఓ రౌండ్‌ కొట్టారు. ఆ తర్వాత అభిమానులు, కార్యకర్తలు ఊహించని నిర్ణయాన్ని ప్రకటించారు.

వీడియో…


విన్నారుగా ఆయన మాటలు.. తమ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎలా అయితే విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారో.. తాను అదే బాటలో నడుస్తున్నానని, అందుకే ఎంతో ప్రేమగా ఇచ్చిన కారును కార్యకర్తలకే తిరిగి ఇచ్చేస్తున్నానని చాలా స్పష్టంగా చెప్పేశారు ఎమ్మెల్యే బాలరాజు. బాలరాజు తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన కార్యకర్తలు, అభిమానులే గాక జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేను ప్రశంసలతో ముంచెత్తారు. రాజకీయాల్లో విలువలు అడుగంటి పోతున్న తరుణంలో ఇలాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపైనే ఉన్నదని రాజకీయవర్గాలు అభిప్రాయపడ్డాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…