Amaravati: అనుకున్న విధంగానే ఏపీ రాజధాని.. అమరావతిపై శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు
అనుకున్న విధంగానే ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ఐదేళ్లుగా అమరావతికి జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుతం అమరావతి ఎలాంటి పరిస్థితిలో ఉందో వివరించారు. మళ్లీ అమరావతిని రాజధాని చేస్తామని అనుకోలేదన్నారు.
అనుకున్న విధంగానే ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ఐదేళ్లుగా అమరావతికి జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుతం అమరావతి ఎలాంటి పరిస్థితిలో ఉందో వివరించారు. మళ్లీ అమరావతిని రాజధాని చేస్తామని అనుకోలేదన్నారు. తమ కష్టాన్ని నాశనం చేశారన్న బాబు ఇది జాతికి జరిగిన ద్రోహంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ధ్వంసమైన ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో అమరావతిపై శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు, వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత ప్రభుత్వం అమరావతిని పట్టించుకోలేదని, ఫలితంగా ఎంతో నష్టం జరిగిందని చంద్రబాబు వివరించారు. పదేళ్లు అయినా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం విచారకరమన్నారు. 2014-19 మధ్య తమ హయాంలో 9వేల కోట్లతో చేపట్టిన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని వీడియోని ప్రదర్శిస్తూ వివరించారు. తాము పడిన కష్టాన్నంతా వైసీపీ ప్రభుత్వం వృథా చేసిందన్న చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
అమరావతి చరిత్ర సృష్టించే నగరమని సీఎం చంద్రబాబు చెప్పారు. శాతవాహనుల కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమ దూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అన్నారు. అందుకే దీన్ని రాజధానిగా నిర్ణయించామన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తారని చెప్పారు. తాను చేపట్టిన ఏ ప్రాజెక్టు అయినా విన్-విన్ పద్ధతిలోనే ముందుకు వెళ్లామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారు కూడా సంతోషంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. అమరావతిలోనూ అదే విధంగా ల్యాండ్ పూలింగ్ నిర్వహించామన్నారు. ప్రపంచలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ అమరావతిదే అన్నారు. వరల్డ్ బ్యాంక్ దీనిని ఓ కేస్ స్టడీగా చూపిందని గుర్తు చేశారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టించారని చంద్రబాబు విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆయన ఆవేదన చెందారు. జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతినిందన్న ఆయన.. అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు.
ఇటీవల స్వర్గస్తులైన రామోజీరావు కూడా ఎంతో రీసెర్చ్ చేసి తనకు అమరావతి పేరును సూచించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దీనికి కేబినెట్ నుంచి ప్రజల దాకా అందరి ఆమోదం లభించిందన్నారు. శంకుస్థాపన సమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నీరు, మట్టిని, దేశంలోని ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీరు, మట్టిని తీసుకొచ్చామన్నారు. ప్రధాని మోదీ సాక్షిగా యుమునా నీటిని, మట్టిని తెచ్చారని చెప్పారు. అమరావతికి ఫౌండేషన్ వేసింది ప్రధాని మోదీ అని, రాజధానికి సహకరిస్తామని అప్పుడు ఆయన మాట కూడా ఇచ్చారని చెబుతూ అమరావతికి పార్లమెంట్ సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు.
రాజధాని నిర్మాణానికి బ్యాంకులు ముందుకు వచ్చాయని, సింగపూర్ దేశం మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, ఆ దేశంతో ఎంవోయూ కూడా కుదుర్చుకున్న సంగతి బాబు చెప్పారు. సీడ్ క్యాపిటల్ ఏరియాతో పూర్తి వివరాలతో మాస్టర్ ప్లాన్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. మొత్తం 9 నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి తాను సీఎంగా ఉన్నప్పుడు సైబరాబాద్‌ను నిర్మించానని, తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌కు ఒక ఎకో సిస్టమ్‌ను తయారు చేశానని చెప్పుకొచ్చారు. హైటెక్ సిటీని డెవలప్ చేయటానికి 14 రోజుల పాటు అమెరికాలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లాగానే అమరావతిని కూడా వరల్డ్ క్లాస్ సిటీగా మారుస్తానని ధృడంగా చెప్పారు.
వైసీపీ పాలనలో అమరావతి బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతిన్నదని, భవిష్యత్‌పై నమ్మకం ఏంటని ప్రశ్నలు ఎదురవుతున్నాయని చెప్పిన చంద్రబాబు అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడంపై దృష్టి పెడతామన్నారు. రాధాని నిర్మాణంతో ఆదాయం పెరుగుతుందని, కృష్ణా, గోదావరి నదుల వల్ల అమరావతికి నీటి కష్టాలుండవని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…