PM Modi in Amaravati Live: నభూతో నభవిష్యతి.. అత్యాధునిక హంగులతో అమరావతి పునర్నిర్మాణం.. ప్రధాని మోదీ శ్రీకారం
PM Modi in Andhra Pradesh Live Updates: రాజధాని నిర్మాణంలో ఇప్పటివరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అంటుంది చంద్రబాబు ప్రభుత్వం. మోదీ శంకుస్థాపన చేయడమే ఆలస్యం..పనులను జెట్‌వేగంతో ప్రారంభించి పూర్తి చేయాలని డిసైడ్ అయింది. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 100 పనులను 77 వేల 249కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. ఈ ఒక్కరోజే 49 వేల 040కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అంటుంది చంద్రబాబు ప్రభుత్వం. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడమే ఆలస్యం.. నిర్మాణ పనులను జెట్ స్పీడ్‌తో ప్రారంభించి పూర్తి చేయాలని డిసైడ్ అయింది. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 100 పనులను 77 వేల 249కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. ఈ ఒక్కరోజే 49 వేల 40కోట్ల రూపాయల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుడుతున్నారు.
అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన. అందుకు అనుగుణంగా 8 వేల 603 చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించారు. అందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మితమవుతుంది. 16.9 చ.కి.మీ. పరిధిలో కోర్ క్యాపిటల్‌ను డిజైన్ చేశారు. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్‌తో ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రభుత్వం, న్యాయ, వైద్యం, పర్యాటకం, నాలెడ్జ్ ఫైనాన్స్, స్పోర్ట్స్, మీడియా, టూరిజం వంటి 9 కార్యకలాపాలపై దృష్టి సారించి 9 థీమ్‌ల్లో 9 నగరాలు ప్లాన్ చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత డిజైనింగ్ సంస్థ నార్మన్ పోస్టర్‌తో ముఖ్య కార్యాలయాల డిజైన్లు చేయించారు. రాజధాని ప్రాంతంలో 30 శాతం పచ్చదనానికి, జలవనరులకు కేటాయించారు. ఐఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్‌తో పాటు ఏడు జాతీయ రహదారులు అమరావతి అనుసంధానమయ్యేలా రూపకల్పన చేశారు. 3 వేల 300 కి.మీ. మేర సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నారు. 131 కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 1,277 ఎకరాలు కేటాయించారు.
రాజధాని అమరావతి కోసం 29 వేల 373 మంది రైతులు 34 వేల 281 ఎకరాలను భూసమీకరణ ద్వారా అందించారు. భూసమీకరణ ద్వారా 34 వేల 281 ఎకరాలు, భూసేకరణ ద్వారా 4 వేల 300 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ, అటవీ, కొండ, ఇతర భూములు15 వేల 167 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుని మొత్తం 54 వేల ఎకరాలు రాజధాని కోసం సమకూరింది. రాజధాని అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం 11 కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని మోదీ ఈ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. రాజధానిలో 75 వేల కోట్ల పనులు చేపట్టాలని నిర్ణయించగా.. ప్రస్తుతానికి 49 వేల కోట్ల వ్యయంతో పనులు చేయడానికి టెండర్లు పిలిచారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేయడానికి కాంట్రాక్టు సంస్థలన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. ఐకానిక్ భవనాలుగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లను మూడేళ్లలో ఇతర ప్రాజెక్టులను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
అమరావతి రాజధాని నేలపాడులో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు తిరిగి పురుడు పోసుకుంటోంది. 856 కోట్ల రూపాయల వ్యయంతో తొలి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో జీ+18 అంతస్తులతో కూడిన 12 టవర్లను నిర్మించబోతున్నారు. మొత్తం 1200 అపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల నివాసాల కోసం భారీ బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాల బ్యాలెన్స్ పనులను 452 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో రూ. 419 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 1 విధానంలో మొత్తం 71 బంగ్లాల బ్యాలెన్స్ పనులు చేపట్టనున్నారు.
అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన రూ. 617 కోట్లతో ఐకానిక్ అసెంబ్లీ భవన నిర్మాణం చేపడుతున్నారు. బేస్‌మెంట్+గ్రౌండ్+3 ఫ్లోర్లతో ఈ భవనం నిర్మిస్తున్నారు. రాజధానిలో తాత్కాలిక హైకోర్టు స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ప్రపంచస్థాయి ఐకానిక్ హైకోర్టు భవనాన్ని 786 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు నివాస, కమర్షియల్ రిటర్నబుల్ ప్లాట్లను ప్రభుత్వం అందిస్తోంది. వివిధ జోన్లలో దాదాపు 15 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఎల్‌పీఎస్ ఇన్ర్ఫా పనులు చేపడుతోంది.
రాష్ర్టానికే ప్రధాన పరిపాలన కేంద్రమైన సచివాలయం కోసం జీ ప్లస్ 40 విధానంలో 4 వేల 668 కోట్ల రూపాయల వ్యయంతో ఐకానిక్ సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. మొత్తం 5 టవర్లను డయాగ్రిడ్ విధానంలో చేపడుతున్నారు. రాజధానిలో వరద సమస్యను శాశ్వతంగా నివారించటానికి వీలుగా 5 వేల 944 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 13 ప్యాకేజీలలో పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు రాజధానిలో రోడ్లు, కేబుల్స్ రహిత డక్ట్స్, సైకిల్ ట్రాక్స్‌కు సంబంధించిన పునరుద్ధరణ పనులను 9 వేల150 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నారు.
LIVE NEWS & UPDATES
-
పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ గిఫ్టు
పవన్ స్పీచ్ అనంతరం సభావేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రసంగాన్ని ముగించుకుని వెళ్తున్న పవన్‌ని పిలిచి మరీ సర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు మోదీ. దీంతో పవన్‌తో పాటు పక్కనే ఉన్న చంద్రబాబు గొల్లున నవ్వారు. అసలేంటా గిప్ట్ అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ తర్వాత అసలు ఘట్టం ప్రారంభమైంది.
-
తాళమేళాలతో తరలివచ్చిన జనం
అమరావతి రీస్టార్ట్ సభ దద్దరిల్లింది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది సభకు తరలివచ్చారు. సీఎం చంద్రబాబుతో కలిసి మోదీ వేదికపైకి రాగానే నమో నమో అంటూ అరుపులతో ప్రజలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబుతో కలిసి ప్రజలకు మోదీ అభివాదం చేశారు.
-
-
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది..! ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశ, ఆకాంక్షగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఇక పరిగెత్తాలి రాజధాని… ఎలాంటి సహాయ సహకారాలైనా అందించడానికి సిద్ధం మీ ప్రధాని… అంటూ ఆంధ్రులు ఉప్పొంగేలా భరోసానిచ్చారు మోదీ.
-
చంద్రబాబు, పవన్ తో కలిసి వికసిత్ ఏపీ కోసం కృషి చేస్తాః మోదీ
టెక్నాలజీ, గ్రీన్ఎనర్జీకి అమరావతి కేరాఫ్ – మోదీ
మీ అందరికీ ఒక రహస్యం చెబుతున్నా-మోదీ
టెక్నాలజీని నేను పరిచయం చేశానని అంటున్నారు
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీ సీఎంగా చంద్రబాబు టెక్నాలజీ వాడకాన్ని గమనించాను.
తొలినాళ్లలో చంద్రబాబును చూసి నేర్చుకున్నా-మోదీ
పెద్దప్రాజెక్ట్‌లు చేపట్టాలంటే చంద్రబాబుతోనేసాధ్యం
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏపీకి గ్రహణం వీడింది
వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ కలలుకన్నారు
నేను, చంద్రబాబు, పవన్ వికసిత్ ఏపీ కోసం కృషిచేస్తాంః మోదీ
ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది
ఏపీలో రైల్వేకి భారీగా నిధులు కేటాయించాం-మోదీ
పోలవరం ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేస్తాం-మోదీ
పోలవరం ప్రాజెక్ట్‌కు పూర్తి సహకారం అందిస్తాం-మోదీ
-
అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తిః ప్రధాని మోదీ
బెజవాడ కనకదుర్గ మాతాకి జై అంటూ.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తిః ప్రధాని మోదీ
ఏపీని అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతి
ఒక గొప్ప స్వప్నం సాకారమవుతుందిః ప్రధాని మోదీ
దాదాపు రూ.60 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టాంః మోదీ
ఇది వికసిత్ భారత్‌కు బలమైన పునాదిః మోదీ
అమరావతి స్వర్ణాంధ్ర విజన్‌కు శక్తిని ఇస్తుందిః మోదీ
అమరావతితో ప్రతి ఆంధ్రుడి స్వప్నం నెరవేరుతుందిః మోదీ
రికార్డ్ వేగంతో అమరావతి నిర్మాణానికి సహకరిస్తాంః ప్రధాని
-
-
అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
Pm Modi Amaravati
రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం.
అమరావతిలో రూ.77,249 కోట్లతో 100 పనులు
రూ.49,040 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన
రాజధాని పనులు, నేషనల్ ప్రాజెక్టులకు శ్రీకారం
11 కీలక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు
217 చ.కి.మీ. పరిధిలో రాజధాని నిర్మాణం
16.9 చ.కి.మీ. పరిధిలో కోర్ క్యాపిటల్
రాజధానిలో 30 శాతం పచ్చదనం, జలవనరులు
భూసమీకరణలో రైతులనుంచి 34,281 ఎకరాలు
రాజధానిలో 9 థీమ్‌లతో 9 నగరాల నిర్మాణం
నార్మన్ పోస్టర్‌తో ముఖ్య కార్యాలయాల డిజైన్లు
-
దేశం మొత్తం ప్రధాని మోదీ వెంటేః సీఎం చంద్రబాబు
- ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు..
- ఎప్పుడు గంభీరంగా ఉండే మోదీ.. ఉగ్రవాదుల దాడితో చలించిపోయారు.
- ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా, మీ వెంటే ఉంటామని ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు
- ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు-చంద్రబాబు
- ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు-చంద్రబాబు
- ఉగ్రవాదంపై పోరులో మోదీకి మా మద్దతు-చంద్రబాబు
- సరైన కాలంలో దేశానికి సమర్థుడైన నాయకుడు మోదీ-బాబు
- పదేళ్లలో 15 కోట్ల మంది పేదరికాన్ని జయించారు
- మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది
- 2027 నాటికి మూడో ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుంది
- కులగణనతో అతిపెద్ద సంస్కరణ చేపట్టారు
- కులగణన అనేది గేమ్ ఛేంజర్‌గా మారనుంది-చంద్రబాబు
- టిలేటర్‌పై ఉన్న ఏపీకి మోదీ ఆక్సిజన్ ఇచ్చారు
- రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రయాణం మొదలైంది-బాబు
- అమరావతి కేవలం ఒక నగరంకాదు..5 కోట్ల మంది సెంటిమెంట్
- రాజధాని కోసం 29 వేల మంది 39 వేల ఎకరాలు ఇచ్చారు
- గత ఐదేళ్లు అమరావతి విధ్వంసం చూశాం-చంద్రబాబు
- రైతుల పోరాటం వల్లే అమరావతి నిలబడింది-చంద్రబాబు
-
ధర్మ యుద్ధంలో గెలిచిన అమరావతి రైతులు: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం త్యాగం చేసిన అమరావతి రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు. రాజధాని లేదన్న నేతలపై గత ఐదేళ్లుగా పోరాడి గెలిచారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని పవన్ మాటిచ్చారు. గత ఐదేళ్లుగా రాజధాని ప్రాంత రైతులు నలిగిపోయారు. అమరావతి రైతులు ధర్మ యుద్ధంలో గెలిచారని పవన్ కల్యాణ్ అన్నారు.
గత ఐదేళ్లలో అమరావతి రైతులు నలిగిపోయారు. లాఠీదెబ్బలు, ముళ్లకంచెల మధ్య ఇబ్బందిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. అమరావతి పనులు నిధులు కేటాయించిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన పవన్, అమరావతి రైతుల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతదేశాన్ని కలచివేసిందన్నారు పవన్. ఇంత ఇబ్బందుల్లో కూడా ప్రధాని ఇక్కడికి రావడం ఏపీ ప్రజల అదృష్టం అన్నారు. అమరావతి రైతుల త్యాగాలను ప్రధాని గుర్తించారన్నారు.
-
భారత్‌కు మోదీ అనే మిస్సైల్ ఉందిః నారా లోకేష్
ఢిల్లీలో బిజీగా ఉన్నా అమరావతికి మోదీ వచ్చారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్న పవన్, రైతులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబుకు సంక్షోభాలు కొత్త కాదన్న లోకేష్, అమరావతి నిర్మించి తీరుతారన్నారు. భారత ప్రజలను రక్షించేందుకు మోదీ అనే మిస్సైల్ ఉందన్నారు లోకేష్. నమో దెబ్బకు పాకిస్తాన్‌కు దిమ్మ తిరిగిపోయిందన్న లోకేష్, ఎంతమంది పాకిస్తానీయులు వచ్చినా ఏం చేయలేరన్నారు. పాక్ ఇక ప్రపంచపటంలో కనపడదని నారాలోకేష్ స్పష్టం చేశారు.
-
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాంః నారాయణ
రూ. 64వేల కోట్లతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందన్నారు. వచ్చే మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం చేసి చూపిస్తామన్నారు మంత్రి నారాయణ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే పనులు ఊపందుకున్నాయి. ప్రధాని చేతులతో పురుడు పోసుకున్న అమరావతి, తిరిగి ఆయన చేతులతోనే పునర్నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రైతుల త్యాగాలు మరువలేనివన్న మంత్రి నారాయణ, అన్నదాతలకు పాదాభివందనలు తెలిపారు.
-
ప్రధానిని సత్కరించిన సీఎం
ధర్మవరం శాలువాతో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు సత్కరించారు. మోదీకి చిత్రపటాన్ని ఆయనకు బహుకరించారు.
-
సీఎం కాన్వాయ్‌లోనే సభాస్థలికి ప్రధాని
అమరావవతి పునర్నిర్మాణ సభలో పాల్గొనడం కోసం అమరావతి చేరుకున్న మోదీ, సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లోనే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అమరావతిలో రాజధాని పునర్మిర్మాణ పనులు ప్రారంభించారు ప్రధాని మోదీ.
-
సభాస్థలికి చేరుకున్న ప్రధాని
రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెలగపూడికి చేరుకున్నారు. వెలగపూడి వద్ద ప్రధాని మోదీ ఏపీ గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఘనస్వాగతం పలికారు. అనంతరం సభాస్థలికి బయల్దేరారు.
-
మేళతాళాలతో తరలివచ్చిన రైతులు
అమరావతి రీలాంచ్‌కు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున జనం తరలివచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి బస్సుల్లో బయల్దేరి వెలగపూడికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి 5లక్షలమంది వచ్చేలా సభాస్థలిలో ఏర్పాట్లు చేశారు. రాజధాని గ్రామాల నుంచి రైతులు మేళతాళాలతో అమరావతికి చేరుకున్నారు.
-
ప్రత్యేక ఆకర్షగా మేకిన్ ఇండియా లోగో
రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బుద్ధుడు, కాలచక్రం, ఎన్టీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ విగ్రహాలతో పాటు మేక్ ఇన్ ఇండియా లోగో ఆకట్టుకుంటున్నాయి.
Make In India
-
వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతి: మంత్రి నారాయణ
మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నామని, జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు మంత్రి నారాయణ అన్నారు. ప్రజా రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ ఆశీస్సులు, సీఎం చంద్రబాబు సారథ్యం ఎంతో కీలకమన్నారు. మూడేళ్లలో అమరావతిని నిర్మిస్తామన్న నారాయణ, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మిస్తామని మంత్రి నారాయణ అన్నారు.
-
కేరళ నుంచి అమరావతికి ప్రధాని మోదీ
Pm Modi Gannavaram
కేరళ నుంచి ప్రత్యేక విమానంలో ప్రదాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఏపీ మంత్రులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ అమరావతికి చేరుకున్నారు. గన్నవరం నుంచి అమరావతి వరకు 8వేలమంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
-
సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతిలోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర నేతలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Published On - May 02,2025 3:13 PM