Pawan Kalyan: పవన్ రింగ్ సెంటిమెంట్!.. ఆ రెండు ఉంగరాల మహిమ ఏంటి?
సీఎం సీఎం అని కార్యకర్తలు ఆవేశ పడుతుంటే.. ఇన్నాళ్లూ తానే వారిస్తూ వచ్చారు పవన్‌కల్యాణ్. కానీ... సీఎం కుర్చీ వైపు తను కూడా ఆశగా చూస్తూనే ఉన్నారు. దానికోసం టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సామదాన బేధ దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. లేటెస్ట్‌గా పవన్ మదిలో మెదిలిన మరో ఉపాయం పేరు... ఉంగరం. ఎస్... పవన్ ధరించిన రెండు ఉంగరాల మీదే ఇప్పుడు చర్చంతా.
పవన్‌కి గతం కంటే ప్రజాకర్షణ తగ్గిందా? అధికారం దక్కినట్టే దక్కి దూరమవుతోందా? పవన్ దృష్టిలో అధికారం అంటే ఏంటి..? సీఎం కుర్చీ దక్కితేనే కిక్కొస్తుందా? ఆ కిక్కు కోసమే ఉంగరాల మహత్యాన్ని నమ్ముకున్నారా?.. అన్న అంశాలపై ఇప్పుడు హాట్ చర్చ నడస్తోంది. 2014లో పొత్తు పెట్టుకున్నా పోటీ చెయ్యలేదు.. 2019లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. అందుకే.. ఈసారి ఈసారి కొడితే కొట్టాలిరా అంటూ 2024 ఎన్నికల్ని చావోరేవో రేంజ్‌లో తీసుకున్నారు పవన్. కానీ.. తనకూ అధికారానికి మధ్య ఏదో అడ్డొస్తోంది అని పవన్ సందేహిస్తున్నారని కొందరు అంటున్నారు.
లేటెస్ట్‌గా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలో మకాం పెట్టారు పవన్‌కల్యాణ్. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.. రాజకీయ ఉపన్యాసాలు దంచికొట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే.. పవన్‌లో సరికొత్త మార్పు చాలామంది గమనించే ఉంటారు ఆయన చేతివేళ్లకున్న ఆ ఉంగరాలు, వాటి వెనుక సీక్రెట్లే ఇప్పుడు హాట్ టాపిక్. భీమవరంలో ఒకవైపు పవన్ ఆవేశంగా మాట్లాడుతున్నా.. ఎదురుగా ఉన్న కార్యకర్తలు ఆయన వేలి ఉంగరాల వైపే తీక్షణంగా చూస్తున్నారు. ఒకటి తాబేలు ప్రతిమతో… మరొకటి నాగప్రతిమతో.. మిలమిలా మెరుస్తున్న ఆ రెండు ఉంగరాలే జనసేన లోపలా బయటా లేటెస్ట్ పొలిటికల్ ఎట్రాక్షన్స్.
పవన్ చేతికున్న ఆ రెండు ఉంగరాల ప్రత్యేకతలేంటి..? అని ఆరా తీస్తే.. ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. తాబేలు ప్రతిమ ఉన్న ఉంగరం ధరిస్తే వృద్ది, అధికారం, ప్రజాకర్షన వంటి అంశాల విషయంలో కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. పుట్టిన తేదీ, పుట్టిన సమయం ప్రకారం పవన్‌ది మకర రాశి. పైగా ఆయనకు రాహు-కేతు దోషాలున్నాయంటోంది జ్యోతిష్య శాస్త్రం. ఇప్పుడు పవన్‌ని వెంటాడుతున్న వైవాహిక సమస్యలు, కుటుంబ సమస్యలు.. రాజకీయ సమస్యలు తీరాలంటే నాగబంధం ఉన్న ఉంగరం ధరిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. అందుకే ఎవరైనా పవన్‌కి అలాంటి సూచన ఇచ్చి ఉండొచ్చని చెబుతున్నారు.
నమ్మకాల్లేవ్.. గిమ్మకాల్లేవ్.. అంటూ సెంటిమెంట్లను తీసి గట్టుమీద పెట్టే పవన్‌కల్యాణ్‌లో ఇటీవల దైవభక్తి బాగా పెరిగింది. సెంటిమెంట్లను కూడా గట్టిగా నమ్ముకున్నట్టున్నారు. దాని ఫలితమే ఈ మహిమాన్వితమైన ఉంగరాలు అంటూ ఆయన అభిమానుల్లో చర్చ మొదలైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…