జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు కూడా సినిమా షూటింగ్ లో బిజీగా గడపనున్నారు. ఇప్పటికే వారాహి జైత్రయాత్రకు స్మాల్ బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. మరికొన్ని రోజుల పాటు షూటింగ్ లోనే ఉండనున్నారు.దీంతో ఆయన మంగళగిరి కార్యాలయానికి కూడా రావడానికి మరింత సమయం పడుతుందంటున్నారు పార్టీ నేతలు..వరుసగా మూడు విడతలు వారాహి యాత్ర నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఇకపై నెలలో సగం రోజులు సినిమాలకు,సగం రోజులు రాజకీయాలకు కేటాయించాలని నిర్నయించారు..
దీంతో ఈసారి ఆయన పుట్టినరోజుకు కూడా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన దూరంగా ఉండనున్నారు.సెప్టెంబర్ రెండో తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.అయితే గతంలో కంటే ఈ ఏడాది భారీగా వేడుకలు నిర్వహించాలని పార్టీ నేతలు,కార్యకర్తలు భావించారు.కానీ షూటింగ్ లతో బిజీగా ఉండటంతో ఆయన అందుబాటులో ఉండటం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు.కానీ పవన్ మనసుకు తగ్గట్లు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ కేడర్ కు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. బర్త్ డే సెలబ్రేషన్స్ పేరిట దుబారా ఖర్చు కాకుండా పది మందికి సేవ చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ రెండో తేదీన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కేడర్ కు సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్యనాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మనోహర్…..సేవా కార్యక్రమాల వివరాలను అందించారు..ముఖ్యంగా ఐదు రకాల సేవా కార్యక్రమాల ద్వారా పేదవారికి ఉపయోగపడాలన్నారు.సెప్టెంబర్ రెండో తేదీ శనివారం నాడు మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మెగా రక్తదానశిబిరం నిర్వహించనున్నారు…పార్టీ ముఖ్యనేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొనాలని మనోహర్ సూచించారు…నాదెండ్ల మనోహర్ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనున్నారు.ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులంతా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఐదు అంశాలతో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త,వీరమహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఇక భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు నిర్వహించి వారికి కొత్త బట్టలు పంపిణీ చేయాలని సూచించారు.రెల్లి కాలనీలు సందర్శించి వారితో పాటు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం,వారికి బట్టల పంపిణీతో పాటు భోజనాలు కూడా ఏర్పాటుచేయాలని పిలుపునిచ్చారు.ఇక వెల్ఫేర్ హాస్టల్స్ ను సందర్శించి విద్యార్ధులకు పుస్తకాలతో పాటు ఇతర స్టేషనరీ సామాగ్రి అందించాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.ఇక ఐదో అంశంగా దివ్యాంగులకు సహాయం చేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఆయన మనసుకు నచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలకు నాదెండ్ల మనోహర్ సూచించారు.పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పదిమంది దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే రక్తదాన శిబిరాలు,బట్టల పంపిణీ,అన్నదానం వంటి కార్యక్రమాలను ఫొటోలను తీసి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్నయించారు.ఈ ఫొటోలతో డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జనసేన వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తేలా ముందుకెళ్తున్నట్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం