శక్తిస్వరూపిణి.. మన్యం దేవత మోదకొండమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. పరవశించిపోయే ప్రకృతి మధ్య మోదకొండమ్మ దేవికి ఏటా మే నెలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇక మోదకొండమ్మ ఉత్సవాలు ఈ యేడాది అంగరంగ వైభవంగా జరిగాయి. డప్పుల దరువులు, తప్పెట గుళ్ళు.. భక్తుల గజ్జెల సవ్వళ్ళు.. అందాల పాడేరు అంతటా ఇప్పుడు ఒక్కటే సందడి. అదే మోద కొండమ్మ ఉత్సవాల సందడి. పాడేరులో పినవేనం రాతి గుహ వద్ద స్వయంభువుగా కొలువుదీరిన మోదకొండమ్మ దేవి ఉత్సవాలంటే అడవంతా అంబరాన్నంటే సంబరం. మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఆ కొండ దేవత ఉత్సవాలు.
మోదం అంటే సంతోషం. భక్తులకు సుఖ సంతోషాలను ప్రసాదించే తల్లి మోద కొండమ్మగా విశ్వసిస్తారు స్థానిక ప్రజలు. కోరిన కోర్కెలు తీర్చే కొగుబంగారం పాడేరు గిరిజన దేవత మోదకొండమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతియేటా మే నెలలో మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక జాతరను నిర్వహిస్తారు. మన్యం దేవత పాడేరు మోద కొండమ్మ అమ్మవారి జాతర ముగింపు ఉత్సవాల సందర్భంగా అనుపు ఉత్సవం కన్నుల పండవగా జరిగింది. అమ్మవారి ఘటాలను పురవీధుల్లో ఊరేగించారు. శతకం పాటు నుంచి ఆలయం వరకు తీసుకొచ్చారు. అనుపు ఉత్సవాలు, చివరి రోజు కావడంతో ఆలయానికి భారీగా భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామునుండే మొక్కులు తీర్చుకునేందుకు బారులు తీరారు భక్తులు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, కలెక్టర్ సమత్ కుమార్‌తో పాటు ఎస్పీ సిన్హా కూడా పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా జరిగే ఈ జనజాతరకు సుదూర తీరాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి, మేళతాళాలతో అమ్మవారి ఘటాలను నిలబెట్టి, ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భంగా సాయం సంధ్యా సమయాన అమ్మవారి ఘటాలను పురవీధుల్లో ఊరేగించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం మోద కొండమ్మ జాతరను గిరిజన జాతరగా గుర్తించిన సంగతి తెలిసిందే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..