AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ongole: ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం.. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్లినట్లు..?

ఒంగోలు శివారులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహేశ్వరి (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూలి పనుల కోసం ప్రియుడు ప్రకాష్‌తో కలిసి పామూరుకు వెళ్తూ త్రోవగుంట వద్ద బస్సు దిగిన ఈ యువతి మృతదేహం మూడు రోజుల తర్వాత లభ్యమైంది. ప్రియుడు అదృశ్యం కావడం, అతడి ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో పోలీసులు గాలింపు చేపట్టి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Ongole: ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం.. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్లినట్లు..?
Ongole
Fairoz Baig
| Edited By: |

Updated on: Oct 14, 2026 | 6:02 PM

Share

ఒంగోలులో ఓ యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువతి తన ప్రియుడితో కలిసి కూలి పనుల కోసం ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరగా.. ఒంగోలు శివారు ప్రాంతంలో బస్సు దిగిన అనంతరం అదృశ్యమైంది. మూడు రోజుల తర్వాత ఆమె మృతదేహం లభ్యమైంది. అయితే, ఆమెతో పాటు ప్రయాణించిన ప్రియుడు కనిపించకుండా పోవడం ఈ ఘటనలో అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆ యువతి ఎలా మృతి చెందింది? ఆమె ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి పామూరుకు ప్రయాణం

పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన మహేశ్వరి (సుమారు 25) కొంతకాలంగా ప్రకాష్‌ అనే యువకుడితో ప్రేమలో ఉంది. వీరిద్దరూ వివాహం చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. కూలి పనుల కోసం ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఈ జంట.. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ నుంచి రైలులో విజయవాడకు చేరుకుంది. అక్కడి నుంచి పామూరు వెళ్లేందుకు బస్సు ఎక్కింది. ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఒంగోలు శివారులోని త్రోవగుంట సమీపంలో వీరిద్దరూ బస్సు దిగారు. అనంతరం సమీపంలోని కిమ్స్‌ ఆసుపత్రి వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది.

మూడు రోజుల తర్వాత కుళ్లిన స్థితిలో మృతదేహం

ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సమీపంలో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో యువతి ముఖాన్ని గుర్తించడం కష్టమైంది. ఆమె వయస్సు సుమారు 25 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మృతురాలు పూల డిజైన్‌ ఉన్న చొక్కా, జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉంది. ఘటనా స్థలంలో లగేజీ బ్యాగు, మహిళల హ్యాండ్‌బ్యాగ్‌ కూడా లభించాయి. మృతదేహంపై బయటకు కనిపించే గాయాలు లేవని పోలీసులు తెలిపినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు చేపట్టిన విచారణలో మృతురాలిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహేశ్వరిగా గుర్తించారు.

ప్రియుడు అదృశ్యం.. సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌

మహేశ్వరి తన ప్రియుడు ప్రకాష్‌తో కలిసి ఒంగోలు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, యువతి మృతదేహం లభ్యమైన సమయంలో ప్రకాష్‌ ఆచూకీ తెలియకపోవడం కేసులో కీలకంగా మారింది. అతని సెల్‌ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. మహేశ్వరి, ప్రకాష్‌ ఇద్దరూ పామూరుకు కూలి పనుల కోసం వెళ్తూ ఒంగోలు వద్ద ఎందుకు దిగారు? అక్కడి నుంచి వారు ఎక్కడికి వెళ్లారు? యువతి మృతికి దారితీసిన పరిస్థితులేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

యువతి మృతికి కారణమేంటి?

యువతి మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతికి గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ద్వారా వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రియుడు ప్రకాష్‌ ఆచూకీ లభిస్తే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ప్రస్తుతం మహేశ్వరి మృతి అనుమానాస్పదంగా మారగా, ప్రకాష్‌ అదృశ్యం కేసును మరింత కీలకంగా మార్చింది. అయితే, ఆమె మృతిలో ప్రియుడి పాత్ర ఉందా? మరేదైనా కారణం ఉందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Follow Us