AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఒకే ఇంట్లో రెండు జెండాలు.. పల్లె పోరులో రక్తసంబంధాలు.. కట్‌చేస్తే ఆసక్తికర ఫలితాలు..

రక్తసంబంధాలు వేరు.. రాజకీయాలు వేరు.. ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని సరికొత్త ట్విస్టులు వెలుగుచూశాయి. ఒకే ఇంట్లో తండ్రి వైసీపీ నుంచి, కూతురు టీడీపీ నుంచి పోటీ చేసి ఇద్దరూ విజయం సాధిస్తే.. మరోచోట సొంత అక్కపై చెల్లెలు గెలిచి షాక్ ఇచ్చింది. ఇంకోవైపు తండ్రీకూతుళ్లు టీడీపీ తరఫున క్లీన్‌స్వీప్ చేసి సంచలనం రేపారు. పల్లె పోరులో ఫ్యామిలీ పాలిటిక్స్ ఎలా రక్తికట్టించాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఒకే ఇంట్లో రెండు జెండాలు.. పల్లె పోరులో రక్తసంబంధాలు.. కట్‌చేస్తే ఆసక్తికర ఫలితాలు..
Father Wins Ycp And Daughter Wins Tdp
Krishna S
|

Updated on: Nov 07, 2026 | 8:52 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆద్యంతం రాజకీయ వేడిని, ఉత్కంఠను రేకెత్తించాయి. పార్టీల బలాబలాలు, ప్రతిష్టాత్మక ఘర్షణల నడుమ.. పలుచోట్ల రక్తసంబంధాల మధ్య జరిగిన ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాలు ఈ ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒకే ఇంట్లో భిన్న పార్టీల జెండాలు పట్టి బరిలోకి దిగిన తండ్రీకూతుళ్లు విజయభేరి మోగించగా.. మరికొన్నిచోట్ల తండ్రీకూతుళ్లు జోడు గుర్రాల్లా దూసుకెళ్లారు. ఇంకొకచోట సొంత అక్కాచెల్లెళ్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరు స్థానికంగా తీవ్ర ఉత్కంఠను రేపింది.

తండ్రి వైసీపీ.. కుమార్తె టీడీపీ.. ఇద్దరిదీ ఘనవిజయం..

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకుమార్తెలు వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగి ఇద్దరూ విజయం సాధించారు. కొత్తపేట-2 ఎంపీటీసీ స్థానం నుంచి కూటమి (టీడీపీ) అభ్యర్థిగా పోటీ చేసిన పొనుగుపాటి చాందిని ఘన విజయం సాధించారు. మరోవైపు ఆమె తండ్రి పొనుగుపాటి సత్యనారాయణ పలివెల-2 ఎంపీటీసీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఈ ఫలితాల్లో మరో విశేషమేమిటంటే.. కూటమి ప్రభంజనంలోనూ కొత్తపేట మండలవ్యాప్తంగా గెలిచిన ఏకైక వైసీపీ అభ్యర్థిగా తండ్రి సత్యనారాయణ నిలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

పాచిపెంటలో టీడీపీ తండ్రీకూతుళ్ల జయకేతనం!

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోనూ తండ్రీకుమార్తెలు ప్రజాక్షేత్రంలో తమ పట్టును నిరూపించుకున్నారు. అయితే ఇక్కడ వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసి రెండు స్థానాలను క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. పాంచాలి ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన తండ్రి జి. యుగంధర్ విజయం సాధించగా.. మాతుమూరు ఎంపీటీసీ స్థానంలో ఆయన కూతురు కావ్య జయకేతనం ఎగురవేశారు. తండ్రీకూతుళ్లిద్దరూ ఏకకాలంలో ఎంపీటీసీలుగా గెలుపొందడంతో పాచిపెంట మండల టీడీపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.

అక్కాచెల్లెళ్ల సమరం.. 45 ఓట్లతో చెల్లెలి విజయం..

అన్నమయ్య జిల్లా కొండయ్యగారిపల్లి ఎంపీటీసీ స్థానంలో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఎన్నికల బరిలో తలపడటంతో ఆద్యంతం ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానంలో వైసీపీ తరఫున పోటీ చేసిన చెల్లెలు కె. లక్ష్మమ్మ.. తన సొంత అక్క అయిన కె. శాంతమ్మపై కేవలం 45 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. పోరు హోరాహోరీగా సాగినప్పటికీ చివరికి చెల్లెలికే విజయం దక్కింది. ఈ పరిషత్ పోరులో రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక స్థానాలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. రక్తసంబంధాలను సైతం పక్కనపెట్టి బరిలోకి దిగిన ఈ పరిషత్ ఎన్నికల ఫలితాలు పల్లె పోరులో సరికొత్త రాజకీయ సమీకరణాలకు వేదికగా నిలిచాయి.

Follow Us