Andhra Pradesh: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.. ఇప్పటివరకు ఉన్న టాప్ 9 హైలెట్స్ ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సమరం ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠను రేపుతోంది! వైసీపీ కంచుకోట పులివెందులలో టీడీపీ జెండా ఎగరడం నుంచి.. నల్లచెరువులో పరిటాల శ్రీరామ్ ఘనవిజయం, పెనుమంట్రలో కేవలం ఒక్క ఓటు మెజార్టీతో గెలుపు వరకు ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అటు కోడూరులో పోలీసులతో తోపులాటలు, ఇటు గన్నవరంలో రీకౌంటింగ్ రచ్చతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం భగ్గుమంది.

ఎక్కడ చూసినా హోరాహోరీ పోరు.. కొన్నిచోట్ల సింగిల్ ఓటుతో గెలుపు, మరికొన్నిచోట్ల రీకౌంటింగ్ లొల్లి.. వెరసి ఏపీవ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపులో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువులో పరిటాల శ్రీరామ్, కడప జిల్లా పులివెందులలో టీడీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేయగా.. గన్నవరంలో రీకౌంటింగ్ వివాదం నడుమ వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో దంపతులు గెలిచి రికార్డు సృష్టించగా, పలుచోట్ల ఉద్రిక్తతల మధ్య కౌంటింగ్ కొనసాగింది.
నల్లచెరువులో పరిటాల శ్రీరామ్ ఘన విజయం
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కీలక విజయాన్ని నమోదు చేసింది. నల్లచెరువు జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఘన విజయం సాధించారు. శ్రీరామ్ గెలుపొందడంతో నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, పరిటాల అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
రీకౌంటింగ్ వివాదం నడుమ గన్నవరం వైసీపీ కైవసం
కృష్ణా జిల్లా గన్నవరం జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి, వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడైన అనగాని రవి విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆయన సమీప ప్రత్యర్థిపై 137 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఫలితంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్ నిర్వహించాలని కూటమి నేతలు తీవ్రస్థాయిలో పట్టుబట్టడంతో కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు కౌంటింగ్ సెంటర్ తలుపులు మూసివేశారు.
పెనుమంట్రలో ఒక్క ఓటుతో టీడీపీ అభ్యర్థి గెలుపు
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి జెడ్పీటీసీ స్థానంలో అత్యంత ఉత్కంఠభరిత పోరు సాగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణ కుమారి కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. స్వల్ప తేడాతో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ శ్రేణులు రీకౌంటింగ్ కోరగా, అధికారులు నిబంధనల ప్రకారం మళ్లీ ఓట్లను లెక్కించారు. అయితే రీకౌంటింగ్‌లోనూ అరుణ కుమారికే ఆ ఒక్క ఓటు ఆధిక్యం రావడంతో అధికారులు ఆమె గెలుపును అధికారికంగా ఖరారు చేశారు.
ప్రత్తిపాడులో భార్యాభర్తల రికార్డు విక్టరీ
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో టీడీపీకి చెందిన దంపతులు ఎంపీటీసీలుగా గెలుపొంది రికార్డు సృష్టించారు. ప్రత్తిపాడు-2 స్థానం నుంచి బరిలోకి దిగిన యాళ్ల జగదీశ్ 1,336 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించగా, ప్రత్తిపాడు-3 స్థానంలో పోటీ చేసిన ఆయన సతీమణి యాళ్ల మంగాదేవి 1,138 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. భార్యాభర్తలిద్దరూ భారీ మెజార్టీలతో విజయం సాధించడంతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.
పులివెందులలో జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
వైఎస్సార్ కడప జిల్లాలో ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతుండగా, వైసీపీ కంచుకోటగా భావించే పులివెందులలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సంచలన విజయం సాధించారు. ప్రత్యర్థిపై ఏకంగా 1,463 ఓట్ల స్పష్టమైన మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పులివెందులలో టీడీపీ జెండా ఎగరడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
పలాస కౌంటింగ్ కేంద్రంలో అపశృతి.. అసిస్టెంట్‌కు గాయాలు
శ్రీకాకుళం జిల్లా పలాస కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రమాదవశాత్తు అపశృతి చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా బారికేడ్లను దాటుతూ కొల్లిగాంకు చెందిన కౌంటింగ్ అసిస్టెంట్ విజయ గౌరి అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడున్న సిబ్బంది వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం పలాస సీహెచ్‌సీకి తరలించారు.
రైల్వేకోడూరులో వైసీపీ ఆందోళన.. పోలీసులతో తోపులాట
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు కౌంటింగ్ కేంద్రం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. కౌంటింగ్ నిబంధనలకు విరుద్ధంగా సాగిందని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తూ కోర్టును ఆశ్రయిస్తామని కొరముట్ల స్పష్టం చేశారు.
విజయనగరంలో బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు
విజయనగరం జిల్లా పరిషత్ ఫలితాలు ఆద్యంతం ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా బొత్స కుటుంబ సభ్యుల పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెర్లాం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్న చిన్న శీను కుమార్తె మజ్జి సిరి సహస్ర స్పష్టమైన ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇక బొత్స ఫ్యామిలీలో గరివిడి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కోడలు పూజిత ఆధిక్యంలో దూసుకెళ్తుండగా, బొండపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బొత్స కుమార్తె అనూష మాత్రం వెనుకంజలో కొనసాగుతుండటం గమనార్హం.
క్రిష్ణగిరిలో సంచలనం సృష్టించిన స్వతంత్ర అభ్యర్థి
ఉమ్మడి కర్నూలు జిల్లా జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన పార్టీల హేమాహేమీలను కాదని క్రిష్ణగిరిలో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శ్రీరాములు అనూహ్య విజయాన్ని నమోదు చేశారు. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నప్పటికీ, ప్రజలు స్వతంత్ర అభ్యర్థి వైపే మొగ్గు చూపడంతో క్రిష్ణగిరి ఫలితం జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
