మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసులురెడ్డి అవినీతి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ప్రకటించారు. తనపై అవాకులు, చవాకులు పేలితే కొవ్వు దించుతామని హెచ్చరించారు దామచర్ల. బాలినేని తనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కౌంటింగ్ జరుగుతుండగానే ఓడిపోతామని తెలుసుకుని తన కుటుంబంతో సహా హైదరాబాద్‌కు పారిపోయిన బాలినేని తన కార్యకర్తలకు ఎలా అండగా ఉంటారని ప్రశ్నించారు. వాడు, వీడు అంటూ సంబోధిస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకునేదీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలినేని వియ్యంకుడు కడుతున్న విల్లాస్‌లో పక్కా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విల్లాస్ కోసం ఐరన్‌ఓర్ ఉన్న కొండల్ని తొలిచి మట్టిని తరలించుకుపోయారన్నారు. విల్లాస్ దగ్గరకు ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి తేలుస్తామని బూతులు మాట్లాడారని, తప్పకుండా విల్లాస్‌లో జరిగిన అక్రమాలపై అధికారులతో విచారణ చేయిస్తామని తేల్చి చెప్పారు. విల్లాస్ ముందు ఉన్న ప్రయివేటు వ్యక్తుల స్థలాలను బెదిరించి రాయించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చిల్లర పనులన్నీ మీరు చేసి మాపై అభాండాలు వేస్తున్నారని ఎమ్మెల్యే బాలినేనిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు దామచర్ల జనార్ధన్.
అంతకుముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. ఒంగోలుని వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. పార్టీ మార్పుపైనా కుండబద్దలు కొట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఒంగోలుకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఒంగోలుకి ఎంటర్ అవ్వడంతోనే అధికారపార్టీ నేతలపై నిప్పులు చెరిగారు బాలినేని. తన అభిమానుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కావాలనే తనపై అవినీతి బురద జల్లుతున్నారని, అలాంటి వారికి ఇక నుంచి సినిమా చూపిస్తానని అన్నారు. ఒంగోలును ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టేదే లేదన్నారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క వ్యక్తి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎక్కడ అవినీతి జరిగినా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తానని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..