Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీగా అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. బాపట్ల జిల్లా చీరాల్లో సెబ్ అధికారులు భారీగా మద్యాన్ని ధ్వంసం చేశారు. వేల బాటిళ్లను జేసీబీ కిందవేసి తొక్కించారు. దాదాపు ఐదులక్షల విలువైన మద్యాన్ని చూస్తుండగానే జేసీబీతో తొక్కించి ధ్వంసం చేశారు. చీరాల పరిసర పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఏడాదిన్నర కాలంగా వేల బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండగా పట్టుకున్న 7,200 మద్యం బాటిళ్లలోని 1,600 లీటర్లకుపైగా మద్యాన్ని చీరాల శివారులో తుక్కుతుక్కు చేశారు.
మద్యంతోపాటు 40 లీటర్ల సారాను సైతం పారబోశారు. అక్రమమద్యంపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలను సెబ్ అధికారులు తు. చ తప్పకుండా ఫాలో అవుతున్నారు. అనుమతి లేని మద్యం రవాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏడాదిన్నరగా 54 కేసుల్లో సీజ్ చేసిన మద్యాన్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు జిల్లా సెబ్ ఏఎస్పీ నర్సింహారావు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ. 4.5 లక్షలు ఉంటుందని తెలిపారు. అక్రమ మద్యం రవాణాపై ఎంతటివారైనా ఉపేక్షించేంది లేదని పోలీసులు తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తరలించినా, అమ్మకాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఓవైపు అధికారులు మద్యం సీసాలను ధ్వంసం చేస్తూంటే మరోవైపు కొందరు మందు బాబులు మద్యం సీసాలను గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లడం గమనార్హం. ప్రస్తుతం ఈ మద్యం ధ్వంసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం కోసం క్లిక్ చేయండి..