బాపట్ల, జనవరి 16: మనవడితో సంతోషంగా.. సరదాగా.. ఉల్లాసంగా.. సాధారణ వ్యక్తిలా సైకిల్‌పై వీధుల్లో సవారీ చేస్తున్న ఏడు పదుల వయస్సున్న ఈ పెద్దాయనను గుర్తించారా? సెలబ్రటీల కుటుంబంలో జన్మించి ఉన్నతమైన చదువుతో ప్రజల నాడిని ఇట్టే పట్టగల ఆ వ్యక్తి.. తెలుగు రాష్ట్రాలలో ఎందరికో సుపరిచితుడు. అయితే సంక్రాంతి పండుగ సందర్బంగా స్వగ్రామంలో కొడుకు, కూతుళ్ళు, మనవళ్ళతో కలిసి సరదాగా ఇలా గడుపుతున్నారు. ఓ మనవడ్ని వీపుపై ఎక్కించకుని ఎంచక్కా సైకిలెక్కి వీధుల్లో సవారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరీ పెద్దాయనంటారా?
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కారంచేడు స్వగ్రామంలో సైకిల్‌పై చక్కర్లు కొడుతున్న ఈ పెద్దాయన.. ఎన్టీఆర్ పెద్దల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయన కుటుంబ సభ్యులతో సొంతూరికి వచ్చి, సంక్రాంతి వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు. కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళతో కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు కారంచేడుకు వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తన సహధర్మచారిణి, బీజేపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి భోగి వేడుకలు మొదలు కనుమ పండుగ వరకు పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో తన కుమారుడు హితేష్ చెంచురామ్ చిన్న కొడుకు రుద్రవరామ్‌ని సైకిల్ పై ఎక్కించుకొని గ్రామంలోని వీధుల్లో సైకిల్ సవారీ చేశారు.
ఏడు పదుల వయస్సులో సైకిల్ తొక్కుతూ చిన్న మనవడితో తెగ ఎంజాయ్ చేశారు . మీకంటే నేనేమి తక్కువ కాదు అంటూ పెద్ద మనవడు, బైరవరామ్ చిన్న సైకిల్ తో తాతను అధిగమించి వెళ్ళే దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు చూసిన దగ్గుబాటి అభిమానులు వీడియోలను వైరల్ చేస్తున్నారు. గత ఏడాది కారంచేడులోని తన అక్క పురందేశ్వరి ఇంటికి సినీనటుడు బాలకృష్ణ సంక్రాంతి వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా దగ్గుబాటి దంపతులు సంక్రాంతి పండుగ సంబరాలను సొంతూరులో ఘనంగా జరుపుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.