Andhra Pradesh: కేంద్రం కీలక నిర్ణయం.. చంద్రబాబుకు భద్రత భారీగా పెంపు..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయనకు ఉన్న భద్రతను డబుల్ చేసింది. 6+6 కమాండోలతో ఉన్న భద్రతను 12+12 కమాండోలతో పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా.. ఆ ఆదేశాలకు అనుగుణంగా.. ఎన్‌ఎస్‌జీ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత పెంపు తక్షణమే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు తక్షణం 12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే.. గురువారం నాడు అమరావతిలోని చంద్రబాబు నివాసాన్ని, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఎన్ఎస్‌జీ డీజీ క్షుణ్ణంగా పరిశీలించారు.
ఇదిలాఉంటే.. కుప్పంలో పొలిటికల్ కుస్తీ నడుస్తోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు తీవ్రస్థాయికి చేరింది. బుధవారం నుంచి మొదలైన ఉద్రిక్తత ఏపీ రాజకీయాలను ఊపేస్తున్నాయి. చంద్రబాబు మూడు రోజుల పర్యటనల నేపథ్యంలో.. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను చించేశారు గుర్తుతెలియని వ్యక్తులు. చంద్రబాబు రోడ్ షో నిర్వహించబోతోన్న మార్గంలోనే ఇది చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు చంద్రబాబు రోడ్ షో కొనసాగే మార్గంలో భద్రత పెంచారు.
ఇక గురువారం(నిన్న) కుప్పం ప్రధాన సెంటర్‌లో ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ విగ్రహాలు ఉన్న ప్రాంతం రణరంగంగా మారింది. తమ పార్టీ ఫ్లెక్సీల చించివేతకు నిరసనగా వైసీపీ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్‌తోపాటు నేతలు వైఎస్‌ఆర్ విగ్రహం దగ్గరకు వచ్చారు. చంద్రబాబు కూడా అదే సమయానికి రావాల్సి ఉండటంతో పోలీసులు వైసీపీ నేతల్ని అడ్డుకున్నారు. దాంతో రోడ్డుపైనే బైటాయించారు ఎంపీ, ఎమ్మెల్సీ. ఈలోపు వైసీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహం పక్కనే ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ఫ్లెక్సీలను చించేశారు. ఇది మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి చంద్రబాబు ర్యాలీగా అటు వైపు వచ్చారు. ఆయనతోపాటు వచ్చిన కార్యకర్తలు వైసీపీ ఫ్లెక్సీలను, జెండాలను పీకేశారు. ఇది మరింత టెన్షన్ క్రియేట్ చేసింది. మరోవైపు వైసీపీ తీరును నిరసిస్తూ కొద్దిసేపు రోడ్డుపైనే కూర్చున్నారు చంద్రబాబు. ఆ తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వస్తారో, ఎవరో వస్తారో రండి అంటూ సవాళ్లు చేశారు. రౌడీ రాజ్యం ఎక్కువ కాలం నడవదని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..