
అసలే సంక్రాంతి పండుగ.. ఆపై కనుమ రోజు. నాన్ వెజ్ కోసం వేచి చూస్తున్న వారికి ఇదే అసలైన పండుగ రోజు. ముక్క లేనిదే ముద్ద దిగుతుందా మరి. దీంతో ఫిషింగ్ హార్బర్‌కు క్యూ కట్టారు జనం. సీ ఫుడ్ కోసం తెగ ఎగబడ్డారు. నచ్చిన చేపలను రొయ్యలు పీతలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ధర పెరిగినా డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉండడంతో మత్స్యకారులు పండగ చేసుకున్నారు.
పండుగ పూట ఇంటికి వచ్చే బంధువులకు, కొత్త అల్లుళ్లకు కనుమ రోజు నాన్ వెజ్ డిషెస్‌ను వండి పెట్టడం అనవాయితీ. ఈ నేపథ్యంలో నాన్ వెజ్ కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారు జనం. అయితే చికెన్ భారీ రేటు పెరగడం.. మటన్ ధరలు కూడా దిగకపోవడంతో.. ఇక.. సీ ఫుడ్ వైపు ఆసక్తి చూపించారు జనం. దీంతో చేపలు, రొయ్యలు, పీతలకు కూడా భారీ డిమాండ్ పెరిగింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ కొనుగోలుదారులతో కళకళలాడింది. సాధారణ రోజుల కంటే డిమాండ్ నేపథ్యంలో రేటు కూడా పలుకుతున్నాయి చేపలు, రొయ్యలు. ధర పెరిగిన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. జనం ఎగబడి కొన్నారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో చేపలు భారీగా ధర పలికాయి. చేపల్లో రారాజు కోనాం చేప కిలో వెయ్యి రూపాయల ధర పలికింది. సాధారణ సమయంలో దాని ధర కిలో 600 రూపాయలు మాత్రమే. పది నుంచి 20 కిలోల వరకు భారీ కోనాం చేపలు బోటు నుంచి దిగడంతో ఫిషింగ్ హార్బర్‌లో భారీగా అమ్మకాలు జరిగాయి. ఇక.. భారీగా లాబ్ స్టర్ రొయ్యలకు కూడా డిమాండ్ పెరిగింది. లాబ్ స్టార్ రొయ్యలు పెద్దవి కిలో 1600, చిన్నవి వెయ్యి రూపాయల గల పలుకుతున్నాయి. ఇక టైగర్ ప్రాన్ కిలో 1400. ఇక చిన్న చేపల పరిస్థితి కూడా అంతే. దిగువ మధ్యతరగతి వారు ఇష్టంగా తినే కానాగడతలు చేపలు కూడా రేటు భారీగానే ఉంది. వందకు మూడు చిన్న చేపలు మాత్రమే లభిస్తున్నాయి.
ఇక.. రెడ్ స్నాపర్ ఫిష్.. కిలో 500. ఒక్కో చేప పది నుంచి 15 కిలోలున్నాయి. పండుగప్ప కిలో 600. ఒక్కో చేప పది కిలోలున్నాయి. బ్లాక్ పాంప్లెట్.. అంటే నల్ల చందువా కిలో రూ. 600. 10 కిలోల భారీ తెల్ల జల్లలు.. కిలో 350 ధర పలుకుతోంది. కోమటి సంచులు.. ఆక్టోపస్ స్క్విడ్ చిన్నవి కిలో రూ. 250.
సీ ఫుడ్ కు డిమాండ్ పెరగడంతో సాధారణ రోజుల కంటే 30 నుంచి 50% వరకు ధర ఎక్కువ చేసి అమ్మకాలు జరిగాయి. సీ ఫుడ్ నే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారని ప్రశ్నిస్తే.. చికెన్ మటన్ రేట్లు పెరగడంతో పాటు వాటికన్నా హెల్దీ ఫుడ్ కదా అని సమాధానం ఇస్తున్నారు జనం. కచ్చితంగా కనుమకు నాన్ వెజ్ లేకపోతే ఎలా మరి అని చమత్కరిస్తూ కిలోల కొద్దీ చేపలు రొయ్యలు సీ ఫుడ్‌ను ఎత్తుకెళ్తున్నారు.