ఏపీకి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో అల్లూరి, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చునని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది కాస్తా ఆదివారం(మే 7) అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉండగా.. సోమవారం(మే 8) నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక మోచా తుఫాన్.. ఉత్తర దిశగా మయన్మార్ వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆ తుఫాను ముప్పు ఏపీకి ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ చెబుతోంది. అల్పపీడనం, వాయుగుండం ప్రభావం కారణంగా రాష్ట్రంలోని కొద్దిమేర వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా కొల్లూరులో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక పిడుగుపాటుకు తిరుపతి జిల్లాలో ఇద్దరు గొర్రెల కాపర్లు గాయపడగా.. 13 గొర్రెలు మృతి చెందాయి.