AP News: ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు
ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఏపీలో ఎలాంటి కరెంట్ ఛార్జీలు పెంపులేదని విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించింది. ఆ వివరాలు ఏంటి.? టారిఫ్ ఛార్జీలు ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. అదేంటో ఓ సారి లుక్కేయండి.

ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపు లేదని ఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ప్రకటించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఏపీలో విద్యుత్ చార్జీల టారిఫ్‌లను వెల్లడించారు. ఏ విభాగంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు. అయితే.. ఈ టారిఫ్‌ల వివరాలను మార్చి 31 లోపు విడుదల చేయాల్సి ఉన్నా.. నెల రోజుల ముందుగానే విడుదల చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ విభాగాల్లో దేనిలోనూ ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెంపు ఉండని తెలిపారు. మూడు డిస్కమ్‌ల ద్వారా రాబడి అంచనా.. 44,323 కోట్లు కాగా.. వ్యయ అంచనా 57,544 కోట్లుగా ఉందని ఈఆర్సీ ఛైర్మన్ రామ్‌సింగ్ వెల్లడించారు. రాబడి వ్యయాల మధ్య అంతరం 12,632 కోట్లుగా ఉందని తెలిపారు. అంతరాన్ని భరించడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు.
ఈఆర్సీ ప్రకటనతో ఏపీ ప్రజలకు కరెంటు బిల్లుల కష్టాల నుంచి భారీ ఊరట లభించినట్లు అయింది. ఇక.. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై APERC గత నెలలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాగూర్ నేతృత్వంలో ఈఆర్సీ అధికారులు విజయవాడలో రెండు రోజులు అభ్యంతరాలు స్వీకరించారు. ఆ తర్వాత.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా విచారణ నిర్వహించింది. ఆయా ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా ఏపీ ఈఆర్సీ కీలక నిర్ణయం తీసుకుంది. కరెంట్ ఛార్జీల పెంపు ఉంటుందా?.. లేదా? అని అనుమానాల నేపథ్యంలో వాటికి ఫుల్‌స్టాప్ పెట్టింది ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




