Andhra Pradesh: నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ జంట.. సినిమాను మించిన ట్విస్టులు, ఛేజింగ్‌లు..!

వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. చదువుకునే రోజుల్లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్ళికి పెద్దలను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, ప్రయత్నాలన్నీ విఫలయత్నాలే అయ్యాయి. ఇక లాభం లేదనుకున్న లవ్ బర్డ్స్..

Andhra Pradesh: నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ జంట.. సినిమాను మించిన ట్విస్టులు, ఛేజింగ్‌లు..!
Love Marriage

Edited By: Shiva Prajapati

Updated on: Jul 10, 2023 | 5:06 PM

  • వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్ళికి ముందే సహజీవనం చేశారు..

  • గర్భం దాల్చిన యువతికి బలవంతంగా అబార్షన్‌ చేయించిన తల్లిదండ్రులు..

  • ప్రియుడితో పారిపోయి పెళ్ళి చేసుకున్న ప్రియురాలు..

  • సినీ ఫక్కీలో ఫైటింగ్‌లు, ఛేజింగ్‌లు..

  • రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట..

వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. చదువుకునే రోజుల్లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్ళికి పెద్దలను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, ప్రయత్నాలన్నీ విఫలయత్నాలే అయ్యాయి. ఇక లాభం లేదనుకున్న లవ్ బర్డ్స్.. పారిపోయి పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నించారు. యువతి తల్లిదండ్రులు అడ్డుపడటంతో సినిమా స్టోరీని తలదన్నే ఫైటింగ్‌లు, ఛేజింగ్‌లు జరిగాయి. ఒకరిని ఒకరు విడిచి ఉండలేక రహస్యంగా సహజీవనం చేశారు. ఫలితంగా యువతి గర్భం దాల్చింది. విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు.. ఆమెకు బలవంతంగా అబార్షన్‌ చేయించారు. చివరకు ప్రియుడిపై యువతి తల్లిదండ్రులు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయించి జైలుకు కూడా పంపారు. ఇంత జరిగినా ఆ యువతి తన ప్రియుడి చేతిని విడిచిపెట్టలేదు. జైలు నుంచి ప్రియుడు బయటకు రాగానే ఇద్దరూ ఇంటినుంచి పారిపోయి గుళ్ళో పెళ్ళి చేసుకున్నారు. తమకు తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.

తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలి..

ప్రకాశంజిల్లా పుల్లలచెరువు గ్రామానికి చెందిన ప్రేమ జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్‌పిని కలిసి వేడుకున్నారు. వేర్వేలు కులాలకు చెందిన తమ ప్రేమపెళ్ళికి యువతి ఇంట్లో ఒప్పుకోలేదని, బలవంతంగా వేరే పెళ్ళి చేసేందుకు ప్రయత్నించడంతో తాము ఇంటినుంచి పారిపోయి గుళ్ళో పెళ్ళి చేసుకున్నామని యువతి ఎస్‌పికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లిదండ్రుల నుంచి తనకు, తన భర్తకు ప్రాణాపాయం ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరింది. దీంతో పోలీసులు ఇరువైపులా పెద్దలను పిలిపించి కౌన్సలింగ్ చేస్తామని ప్రేమజంటకు హామీ ఇచ్చారు.

సినిమా స్టోరీని తలదన్నే లవ్‌స్టోరీ..

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామానికి చెందిన లెక్కల పవన్‌కుమార్‌, పుల్లలచెరువు తండాకు చెందిన దేశావత్‌ రూపాబాయి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గుంటూరులో చదువుకుంటున్న క్రమంలో ఒకే గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌, రూపాబాయిల మధ్య పరిచయం ప్రేమగా మారింది. తమ ప్రేమ వ్యవహారాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. పవన్‌కుమార్‌ ఇంట్లో పెళ్ళికి అంగీకరించారు. అయితే రూపాబాయి తల్లిదండ్రులు, బంధువులు వీరి ప్రేమకు అడ్డుచెప్పారు. కులాలు వేరుకావడంతో పెళ్ళి చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని రూపాబాయికి నచ్చజెప్పారు. అయితే తాను పవన్‌కుమార్‌నే పెళ్ళి చేసుకుంటానని మొండికేసిన రూపాబాయి తన ప్రియుడు పవన్‌కుమార్‌తో కొంతకాలం రహస్యంగా సహజీవనం చేసింది. రూపాబాయి పవన్‌కుమార్‌తో వెళ్ళిపోయేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ఆమె బంధువులు ఆమెను బలవంతంగా తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో సినిమా స్టైల్లో ఫైటింగ్‌లు, ఛేజింగ్‌లు జరిగాయి. పవన్‌కుమార్‌పై రూపాబాయి బంధువులు దాడి చేసి కొట్టారు. చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఈనేపధ్యంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి.

ఇవి కూడా చదవండి

అయినా రూపాబాయి రహస్యంగా పవన్‌కుమార్‌ణు కలుస్తుండేది. ఈ క్రమంలో రూపాబాయి గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా గర్భస్రావం చేయించారు. రూపాబాయి ఎస్‌టి మహిళ కావడంతో పవన్‌కుమార్‌పై అట్రాసిటీ కేసు పెట్టించారు. ఈ కేసులో పవన్‌కుమార్‌ మూడు నెలలు రిమాండ్‌కు కూడా వెళ్ళి వచ్చాడు. ఈ గ్యాప్‌లో మరో యువకుడితో రూపాబాయి వివాహం చేసేందుకు ప్రయత్నించారు ఆమె తల్లిదండ్రులు. అయితే, ఈ పెళ్లి ఇష్టంలేని రూపాబాయి తన ప్రియుడు పవన్‌కుమార్‌తో కలిసి పారిపోయింది. గుంటూరుజిల్లా తాడేపల్లిలోని సాయిబాబు దేవాలయంలో ఆదివారం నాడు పెళ్ళి చేసుకున్నారు. సోమవారం నాడు ఒంగోలులో జిల్లా ఎస్‌పి మలికగార్గ్‌ను కలిసి తామిద్దరూ మేజర్లమని, తమ ప్రేమపెళ్ళి ఇష్టంలేని తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని రూపాబాయి స్పందనలో ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇరువైపులా పెద్దలను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇస్తామని పోలీసులు ప్రేమజంటకు హామీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..