Andhra: అప్పుడే పుట్టిన అరుదైన శిశువు.. తల్లి పాలు ఇస్తుండగా..
అరుదుగా శిశువుల్లో పుట్టిన వెంటనే ఒకటి లేదా రెండు పళ్ళు కనిపిస్తే వాటిని నాటల్ టీత్ అంటారు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. లక్షమంది పిల్లల్లో ఒక్కరిలో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇలా..

తల్లి గర్భం నుంచి బయట పడగానే అపుడే పుట్టిన పసికందుకు పళ్ళు ఉండవు. 6 మాసాల వరకు ఇవి పిల్లల్లో కనిపించవు. సాధారణంగా శిశువు పుట్టగానే వారి చిగురుల్లో దంతాలు దాగి ఉంటాయి. అవి పెరగటం క్రమక్రమంగా మొదలై 6 నెలలకు పిల్లల్లో పాలపళ్ళు.. మిల్క్ టూత్ లేదా బేబీ టూత్ బయటకు కనిపిస్తాయి. కానీ అరుదుగా శిశువుల్లో పుట్టిన వెంటనే ఒకటి లేదా రెండు పళ్ళు కనిపిస్తే వాటిని నాటల్ టీత్ అంటారు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. లక్షమంది పిల్లల్లో ఒక్కరిలో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ నాటల్ టీత్ వల్ల పిల్లలు తల్లి పాలు తాగటానికి ఇబ్బంది అవుతుంది. తల్లి పాలిచ్చే సమయంలో ఆమె నొప్పి భరించాల్సి ఉంటుంది. జన్యుపరమైన లోపం కారణంగా ఇలా జరుగుతుంది కాబట్టి అది ఊడిపోయి శిశువుకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కూడా ఉంది. అయితే తాజాగా ఇలాంటి ఘటన ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతంలో జరిగింది. దుర్గ అనే మహిళకు జన్మించిన శిశువుకు ఇలా పుట్టిన వెంటనే కింద చిగురులో దంతం కనిపించింది. పుట్టిన 6 రోజుల పసికందుకు స్థానిక దంత వైద్య నిపుణుడు దేవిశెట్టి దినేష్ సర్జరీ చేసి పాల దంతాన్ని తొలగించారు. పన్ను కోరగా ఉందని దీన్ని జాగ్రత్తగా తొలగించినట్లు వైద్యుడు చెప్పారు.
