Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు.. మరిన్ని వివరాలు

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను మరో నెల రోజుల్లో పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం(Andhra Pradesh Govt)  సన్నాహాలు చేస్తోంది. మార్చి 3 వరకు కొత్త ఏర్పాటుపై ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు.

Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు.. మరిన్ని వివరాలు
AP New Districts
Follow us
Janardhan Veluru

|

Updated on: Feb 12, 2022 | 1:44 PM

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను మరో నెల రోజుల్లో పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం(Andhra Pradesh Govt)  సన్నాహాలు చేస్తోంది. మార్చి 3 వరకు కొత్త ఏర్పాటుపై ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మార్చి 17నాడు తుది నోటిఫికేషన్ జారీ చేసి.. మరుసటి రోజు (మార్చి 18న) గెజిట్ నోటిషికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని జగన్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలనా సౌలభ్యం లభిస్తుందంటూ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.  కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి శనివారం (12 ఫిబ్రవరి 2022)నాడు చోటు చేసుకున్న 9 కీలక పరిణామాలు ఏంటో తెలుసుకోండి.

  1. అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ప్లానింగ్ సెక్రటరీ, సీసీఎల్ఏ సెక్రటరీ, జిల్లాల కలెక్టర్లతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కమిటీ సిఫార్సులు ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్‌లో మార్పులు,చేర్పులపై సీఎస్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.
  2. ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపవద్దని వైసీపీ కార్యకర్తలు కోరుతున్నారు. ఆ మేరకు కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసిపి కార్యకర్తలతో కలిసి కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ఒంగోలులో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
  3. గుంటూరు : పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని కోరుతూ గుంటూరులో ఇంటలెక్చువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, లక్ష్మణరావు, మధ్యవిమోచన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ లక్షణరెడ్డి, డిప్యూటీ మేయర్ సజీలా తదితరులు పాల్గొన్నారు.
  4. గుంటూరు: చిన్న జిల్లాల ఏర్పాటు నిర్ణయం అభినందనీయమని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ హర్షం వ్యక్తంచేశారు. జిల్లాల విభజనతో పరిపాలన సౌలభ్యం లభిస్తుందన్నారు. పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పేరు పెట్టాలని మొదట నుంచి కోరుతున్నామని గుర్తుచేశారు. గురజాలను జిల్లా కేంద్రంగా చేయాలని మొట్టమొదటిగా ప్రస్తావించింది తామేనన్నారు. గురజాల లేదా పిడుగురాళ్ల ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే బాగుంటుందన్నారు. పల్నాడులోని అన్ని ప్రాంతాల వారికి పిడుగురాళ్ల దగ్గరగా ఉంటుందని.. నిపై త్వరలోనే కమిటీకి నివేదిక ఇస్తామని తెలిపారు.
  5. కర్నూలు జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలన్న డిమాండ్ బలం పుంజుకుంటోంది. ఆ మేరకు కర్నూలులో దామోదరం సంజీవయ్య ఇంటి దగ్గర తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్, దామోదరం సంజీవయ్య కుటుంబీకులు దీక్ష చేపట్టారు.
  6. కడప జిల్లా రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట పార్టీ ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడును పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ బయట టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ లోనికి వెళ్లనివ్వకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా సాధన కోసం రాజంపేటలో చేస్తున్న నిరసనలకు వెళ్లనివ్వకుండా చెంగల్రాయుడిని పోలీసులు అరెస్టు చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
  7. టీడీపీ నేత బత్యాల చంగల్రాయుడు కొత్త జేఏసీ ఏర్పాటు చేసి కొత్త డ్రామాలు ఆడుతున్నారని జేఏసీ నేత మేడా విజయశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. కొందరు అరాచక శక్తులను వెంటేసుకుని కావాలనే కొత్త జేఏసీ ఏర్పాటు చేశారన్నారు. పోలీసులతో గొడవలు పెట్టుకుని హింసలు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు. తద్వారా రాజంపేటలో ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చి వైసీపీని బద్నాం చేయాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. రాజంపేట ప్రజలు టిడిపి నేత చంగల్రాయుడు వేషాలన్నీ గమనిస్తూనే ఉన్నారన్నారు.
  8. విజయవాడ: కొత్త జిల్లాలపై ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా.. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా విభజిస్తుందని టీడీపీ నేత బోండా ఉమ డిమాండ్ చేశారు. కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామంటే టీడీపీ అడ్డుకుంటోందని కొడాలి నాని అనడం సరికాదన్నారు. కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామంటే వద్దన్న, అడ్డుకున్న వ్యక్తులు ఎవరో కొడాలి నాని చెప్పాలన్నారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయాలకు అతీతంగా తాను దీక్ష చేసినట్లు చెప్పారు. తన దీక్షకు అన్ని పార్టీల నేతలు, రంగా అభిమానులు వచ్చారని చెప్పారు.
  9. తిరుపతిలోని అలిపిరి వద్ద జనసేన కార్యకర్తలు నిరసన చేపట్టారు. బాలాజీ జిల్లా పేరుకు బదులు తిరుపతి జిల్లా పేరు పెట్టాలని అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి జనసేన నిరసన తెలిపారు. ఈ ప్రాంతాన్ని భక్తులు తిరుమల తిరుపతి అంటారని గుర్తుచేశారు. తిరుపతి పేరుతో పార్లమెంట్ నియోజకవర్గం ఉందని.. ఇవన్నీ కాదని బాలాజీ జిల్లా పేరెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. స్థానికంగా బాలాజీ అనే పేరు వాడుకలో లేదన్నారు. ఎవరి మెప్పు కోసం బాలాజీ జిల్లాగా పేరు పెట్టాలని భావిస్తున్నారంటూ జనసేన నేత కిరణ్ రాయల్ అభ్యంతరం తెలిపారు.

Also Read..

V. Hanumantha Rao: కర్నూలులో దీక్షకు దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌.. కారణమేంటంటే..

Medaram Jatara 2022: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి హెలికాప్టర్‌ సేవలు.. ఛార్జీలు ఎలా ఉన్నాయంటే..