Andhra Pradesh: ఈ జిల్లాలో ఒకే పార్టీ నేతలే ప్రత్యర్ధులు..బాబాయ్ వర్సెస్ అబ్బాయ్.. వైసీపీ నేతల మధ్య వర్గ పోరు..
మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యుల మధ్య మాటల యుద్ధం.. ఒకరిపై విరుచుకుపడటం కామనే.. కానీ ఇక్కడ ఒక్క పార్టీ నేతలే ప్రత్యర్ధులుగా మారారు. అనిల్ వర్సెస్ రూప్.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ అన్నది స్పష్టంగా అర్ధమయ్యింది. ఒకే పార్టీ నేతలే ఇలా గొడవకు దిగడం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Andhra Pradesh: ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంటుంది.. అయితే ఏపీలోని ఆ జిల్లాలో మాత్రం రాజకీయ పరిస్థితులు భిన్నంగా సాగుతున్నాయి. సొంతపార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. అదికూడా అధికార పార్టీ వైసిపీ నేతల మధ్య వర్గ పోరు ఓ రేంజ్ లో కొనసాగుతుంది. మరి ఆ వర్గపోరు జరుగుతున్న జిల్లా నెల్లూరు జిల్లా (Nellore District).. అవును నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్‌లో (Nellore Municipal corporation) 54 డివిజన్లు ఉన్నాయి.. ఇటీవల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక్కటంటే ఒక్క సీటు దక్కలేదు. అన్ని డివిజన్లలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కౌన్సిల్ లో ప్రతిపక్షమే లేకుండా పోయింది. నగరంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. కౌన్సిల్‌లో ప్రశాంత వాతావరణంలో చర్చ జరుగుతుందని నెల్లూరు ప్రజలు భావించారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు కాస్తా.. హీట్ పుట్టిస్తోంది. తిట్లు, కొట్లాటలు లేకపోతే మజా ఉండదనుకున్నారో.. ఏమో నెల్లూరు మున్సిపల్ కౌన్సిల్‌లో రచ్చ రచ్చ చేశారు. ఒకే పార్టీలో రెండు వర్గాలు ఉండటమే దీనికి అసలు కారణం.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయ్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌కి ఇటీవల చిన్న విబేధాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఒకరంటే ఒకరికి అస్సలు పడడం లేదు. ఇదే కౌన్సిల్‌లో గొడవకు కారణమనే చర్చ జరుగుతోంది. కౌన్సిల్ సమావేశంలో అనిల్ అనుచరుడైన కౌన్సిలర్ కర్తం ప్రతాప్ రెడ్డి.. డిప్యూటీ కమిషనర్ చెన్నుడిపై పలు ఆరోపణలు చేశారు. దీంతో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కలగజేసుకున్నారు. అధికారులను టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అని పై పైకి దూసుకెళ్లారు. ఇదంతా చూస్తున్న వారికి అనిల్ వర్సెస్ రూప్.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ అన్నది స్పష్టంగా అర్ధమయ్యింది. ఒకే పార్టీ నేతలే ఇలా గొడవకు దిగడం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..