Andhra Pradesh: నెల్లూరు రొట్టెల పండుగ మహిమ.. ఈ కొత్త జంట రియల్ స్టోరీ వింటే నిజమేనని నమ్మాల్సిందే..
నాడు పెళ్లి కావాలని వేర్వేరుగా వచ్చి రొట్టెలు మార్చుకున్నారు... కట్ చేస్తే, నేడు అదే దర్గా సాక్షిగా భార్యాభర్తలుగా మారి నవదంపతులుగా చేతులు పట్టుకుని తిరిగి వచ్చారు.. వినడానికి ఏదో సినిమా కథలా ఉందా? కానీ ఇది అక్షరాలా నిజం. నెల్లూరు రొట్టెల పండుగలో జరిగిన ఈ అద్భుతమైన సంఘటన ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

తమ కోరికలు తీరాలని భక్తులు ఎన్నో ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. కానీ నెల్లూరులో ఏడాదికోసారి జరిగే రొట్టెల పండుగ మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఏం కోరుకున్నా ఇట్టే నెరవేరుతుందనేది లక్షలాది మంది భక్తుల గట్టి నమ్మకం. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఐదు రోజుల రాష్ట్ర పండుగలో.. నెల్లూరు స్వర్ణాల చెరువు వేదికగా దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడి బారాషహీద్ దర్గాను దర్శించుకుని, స్వర్ణాల చెరువు నీటిలో నిలబడి రొట్టెలు మార్చుకోవడం ఇక్కడి ప్రధాన ఆనవాయితీ. అయితే ఈ ఏడాది జరుగుతున్న రొట్టెల పండుగలో ఒక అద్భుతమైన సంఘటన వెలుగుచూసింది. రొట్టెలు మార్చుకున్న రెండు వేర్వేరు కుటుంబాలు.. ఇప్పుడు ఒకే కుటుంబంగా మారి నవదంపతులుగా దర్గాకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
పెళ్లి రొట్టె తెచ్చిన బంధం.. కట్ చేస్తే పెళ్లయిపోయింది..
వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది జరిగిన రొట్టెల పండుగకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక కుటుంబం వచ్చింది. తమ కుమార్తెకు త్వరగా వివాహం జరగాలని కోరుకుంటూ వారు స్వర్ణాల చెరువులో వివాహ రొట్టెను తీసుకున్నారు. అదే సమయంలో మరో కుటుంబం కూడా తమ కుమారుడికి త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటూ అక్కడ రొట్టె తీసుకున్నారు. కట్ చేస్తే.. బారాషహీద్ సాక్షిగా ఆ దైవ సంకల్పం నెరవేరింది. రొట్టెలు తీసుకున్న కొద్ది రోజులకే ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధం కుదిరింది. ఆ అబ్బాయి, అమ్మాయి పెళ్లి పీటలు ఎక్కారు. కోరిన కోర్కెలు ఇట్టే తీరడంతో ఈ ఏడాది జరుగుతున్న రొట్టెల పండుగకు ఆ రెండు కుటుంబాలు ఒక్కటై.. కొత్తగా పెళ్లయిన నవ దంపతులతో కలిసి నెల్లూరు వచ్చారు.
నాడు పెళ్లి కోసం.. నేడు సంతానం కోసం..
తమ కోరిక నెరవేరినందుకు కృతజ్ఞతగా.. నవదంపతులు ఇద్దరూ కలిసి ఈసారి వివాహ రొట్టెను తిరిగి ఇచ్చేందుకు వచ్చారు. ‘‘చాలామంది నమ్ముతున్నట్టే మేము కూడా నమ్మకంతో ఇక్కడికి వచ్చాం.. మా కోరిక నెరవేరి మేము ఒక్కటయ్యాం’’ అని ఆ నవదంపతులు ఎంతో భక్తితో వెల్లడించారు. అంతేకాదు ఈసారి తమకు త్వరగా సంతానం కలగాలని కోరుకుంటూ సంతోషంగా సంతాన రొట్టెను తీసుకొని వెళ్తున్నట్లు ఆ దంపతులు చెప్పారు.
కోర్కె ఏదైనా.. ఇక్కడ రొట్టె దొరుకుతుంది..
నెల్లూరు రొట్టెల పండుగలో ఇదో పెద్ద బ్యూటీ. ఇక్కడ ఉద్యోగం కావాలన్నా, పెళ్లి కావాలన్నా, పిల్లలు కలగాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా , వ్యాపార అభివృద్ధి కావాలన్నా.. ఇలా అనేక రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను భక్తులు ఇచ్చుపుచ్చుకుంటారు. ఒక ఏడాది కోరిక కోరుకుంటూ రొట్టె తీసుకుంటే.. ఆ కోరిక తీరిన తర్వాత మరుసటి ఏడాది వచ్చి ఆ రొట్టెను తిరిగి ఇవ్వడం ఇక్కడి సాంప్రదాయం. ఈ నమ్మకమే ఏటా రొట్టెల పండుగ జనసంద్రాన్ని మరింత పెంచుతోంది.
