Nellore Ayurvedic Medicine: నెల్లూరు ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్‌చార్జ్ మంత్రి కిరణ్ రిజ్జు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్‌కు సూచించారు. నెల్లూరు ఆయుర్వేద మందు విషయంలో నెలకొన్న పరిస్థితులు ఉపరాష్ట్రపతి దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే కేంద్ర మంత్రి మరియు డైరెక్టర్ జనరల్ తో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే అధ్యయనం ప్రారంభించి వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
కాగా, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తున్న మందు ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే, ఈ రోజు నుంచి మళ్లీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా మందు కోసం జనం క్యూలు కడుతున్నారు. ఆనందయ్య కరోనా మందు తీసుకోవడంతోనే తన ప్రాణాలు నిలబడ్డాయంటూ అనేక మంది కరోనా నుంచి బయటపడ్డ వాళ్లు చెప్పుకొస్తున్నారు. అయితే నెల్లూరుకి ఐసీఎంఆర్ టీమ్‌ను పంపాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. కరోనాకు విరుగుడుగా ప్రచారం జరుగుతున్న ఆనందయ్య మందుపై అధ్యయనానికి ఈ బృందం పరిశీలించనుంది. సీఎం వద్ద ఆనందయ్య మందులపై చర్చ జరిగింది.