Godavari Floods: గోదావరి మహోగ్రరూపం.. లంక గ్రామాలు విలవిల

|

Jul 28, 2024 | 9:26 AM

గోదావరి నదీ పరివాహక రాష్ట్రాల్లో భారీ వర్షాలు తీవ్రంగా కురుస్తున్న దృష్ట్యా రాగల రోజుల్లో వరద తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Godavari Floods: గోదావరి మహోగ్రరూపం.. లంక గ్రామాలు విలవిల
Godavari Floods
Follow us on

గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో ఉభయగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. ఏలూరుజిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో గుట్టలపై తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ముంపు బాధితులు. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంపు బాధితులకు 3వేల రూపాయల ఆర్థికసాయం అందించనున్నారు అధికారులు. నగదుతోపాటు 25 కిలోల బియ్యం, కందిపప్పు, లీటరు మంచినూనె, కూరగాయలు కూడా అందించనున్నారు.

గోదావరి వరదనీరు పోటెత్తడంతో కుకునూరు-భద్రాచలం ప్రధాన రహదారి నీట మునిగింది. కోయిదా, కట్కూరు పంచాయతీ పరిధిలో 14 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక యలమంచిలి మండలంలోని ముంపు గ్రామాలు కనకాయలంక- పెదలంక, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, యలమంచిలి లంక గ్రామాల్లో పోలీసు కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేశారు.

మరోవైపు పశ్చిమగోదావరిజిల్లా దువ్వ-యనమదురు కాలువకు భారీగా వరదనీరు చేరడంతో తణుకు నియోజకవర్గంలో పలు గ్రామాలు నీటమునిగాయి. మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నిమ్మ రామానాయుడు, కొలుసు పార్థసారధి, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ముంపు గ్రామాలను పరిశీలించారు. నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.