YCP Support to NDA: వైసీపీ నిర్ణయంతో.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక..!

|

Jun 26, 2024 | 7:50 AM

దేశవ్యాప్తంగా లోక్‌సభ స్పీకర్ ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ.. లోక్‌సభ స్పీకర్‌ను అధికార, విపక్షాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుండగా, ఈసారి ప్రతిపక్ష ఇండి కూటమి కూడా స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో.. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

YCP Support to NDA: వైసీపీ నిర్ణయంతో.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక..!
Babu Pawan Jagan
Follow us on

దేశవ్యాప్తంగా లోక్‌సభ స్పీకర్ ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ.. లోక్‌సభ స్పీకర్‌ను అధికార, విపక్షాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుండగా, ఈసారి ప్రతిపక్ష ఇండి కూటమి కూడా స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో.. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే, లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాక రేపింది. ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల్లో వైసీపీ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటేయనున్నట్లు వైసీపీ వెల్లడించడంతో.. ఆ పార్టీ నిర్ణయం ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశం అవుతోంది.

వాస్తవానికి.. ఇటీవల జరిగిన ఏపీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రధానంగా ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమికి 21 సీట్లు గెలుచుకోగా, వైసీపీ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దాంతో ఏపీలో బీజేపీ, వైసీపీ పూర్తిగా అధికార, విపక్షాలుగా మారాయి. రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఎన్డీఏకి వైసీపీ మద్దతు తెలపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ వద్దని వెళ్లినా, వైసీపీ అటువైపే మొగ్గుచూపడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతోంది. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతిస్తున్నట్లు వైసీపీ ప్రకటించడంతో మోదీ, జగన్‌ మధ్య సంబంధం మరోసారి బయటపడిందన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జేడీ శీలం. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికకు మద్దతిస్తామని ప్రకటించడమే కాదు.. ఐదేళ్ల పాటు దానిని కొనసాగిస్తూనే ఉంటారని ఆరోపించారు. అందుకే.. మోదీ, జగన్‌ బంధం పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జేడీ శీలం సూచించారు.

మొత్తంగా.. ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికనే సస్పెన్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. అయితే.. ఇప్పటివరకు తటస్థంగా ఉన్న వైసీపీ.. ఇప్పుడు స్పీకర్‌ ఎన్నిక విషయంలో సడెన్‌గా బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం జాతీయ రాజకీయాలతోపాటు.. ఏపీ పాలిటిక్స్‌లోనూ ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇక.. కాంగ్రెస్‌ విమర్శల నేపథ్యంలో వైసీపీ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…