
టీడీపీ నేత లోకేశ్(Nara Lokesh), ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు(TDP Leaders), కార్యకర్తలపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిలదీస్తూ.. త్వరలోనే రోడ్డెక్కుతానని లోకేశ్ అన్నారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) ప్రజల్లో తిరుగుతున్నారన్న లోకేశ్.. తనతో పాటు నేతలంతా ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. మాచర్లలో పర్యటిస్తున్న లోకేశ్.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పల్నాడు జిల్లా రావులాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి మరీ దాడులకు పాల్పడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూలిగొట్టిన ఘటనను గుర్తు చేశారు. తనపై కూడా 14 కేసులు పెట్టారని, అయితే తన బయోడేటాలోనే భయం లేదన్నారు లోకేశ్.
ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిలదీస్తూ త్వరలోనే రోడ్డెక్కుతా. వైసీపీ పాలనలో గంజాయి అక్రమ రవాణా, నాటుసారా మరింత పెరిగిపోయాయి. జగన్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి బాధలు పోవాలంటే చంద్రబాబు రావాలి. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే ప్రజల బాధలు తీరతాయి.
– నారా లోకేశ్, టీడీపీ లీడర్
జల్లయ్య హత్య ఘటన..
పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో 2019 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతల ఆగడాలు తట్టుకోలేక టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న పలు కుటుంబాలు జంగమహేశ్వరపాడు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయి. కంచర్ల జల్లయ్య కుటుంబం కూడా ఇలాగే గ్రామం వదిలి గురజాల మండలం మాడుగులలో నివాసముంటోంది. తమ కుటుంబంలో పెళ్లి నేపథ్యంలో బ్యాంకు పని, పెళ్లి కార్డులు పంచేందుకు జల్లయ్య శుక్రవారం దుర్గి వచ్చారు. అక్కడి నుంచి బొల్లాపల్లి మండలం రావులాపురానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జంగమహేశ్వరపాడు మీదుగా వస్తారని తెలుసుకున్న ప్రత్యర్థులు గ్రామ సమీపంలోని అడ్డరోడ్డువద్ద కాపు కాశారు.
బైక్ లపై జల్లయ్యతో పాటు ఆయన బంధువులు ఎల్లయ్య, బక్కయ్య వస్తుండగా అడ్డగించి, దాడి చేశారు. ప్రత్యర్థులు జల్లయ్యపై గొడ్డళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు. ఈలోగా చుట్టుపక్కల వాళ్లు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. 108లో జల్లయ్యను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జల్లయ్య మృతి చెందారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి