తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ – బ్రాహ్మణిల తనయుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు నేడు. దేవాన్ష్ జన్మదినం సందర్భంగా లోకేష్ దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు. దేవస్థానంలో ఒక రోజు అన్నప్రసాద వితరణ ప్రకటించారు. ఇందుకోసం అయ్యే ఖర్చు 33 లక్షల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందజేశారు. లోకేష్-బ్రాహ్మణి దంపతుల విరాళంతో నేడు టీటీడీ అన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేశారు.
కాగా, ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజున టీటీడీకి అన్నప్రసాద వితరణకు విరాళం ఇస్తూ వస్తున్నారు లోకేష్ దంపతులు. ప్రతిఏడాది మాదిరిగానే, ఈ ఏడాది కూడా విరాళం ఇచ్చారు. అయితే, దేవాన్ష్ పేరిట విరాళం అందుకున్న టీటీడీ.. ఈ విషయాన్ని తెలుపుతూ తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డిస్‌ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు. మరోవైపు దేవాన్ష్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ టీడీపీ శ్రేణులు తమ తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..