ఏపీలో అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అంటూ ఒకరిపై ఒకరు మాటలు తూటాలను విసురుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ ప్రభుత్వం తీరుపై సీఎం జగన్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రౌడీల తోకలు కట్ చేస్తాం.. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. తమకు అడ్డు వచ్చిన వారందరినీ చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. త్వరలోనే వివేకా హత్య కేసును ప్రజాకోర్టులో పెడతామన్నారు టీడీపీ అధినేత.
కడపలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అధ్యక్షతన టీడీపీ జోన్-5 నేతలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలోవైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. వివేకా హత్య కేసుపై చంద్రబాబు స్పందించారు. ప్రపంచంలోని పోలీసు అధికారులకు వివేకా హత్య కేస్ స్టడీగా మారుతుందని వెల్లడించారు. వివేకా హత్య కేసు నిందితులు సీబీఐ అధికారులనూ బెదిరించారని ఆరోపించారు. హత్యా రాజకీయాలు పోవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. సీమలో ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా అణిచివేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు. కానీ జగన్ హయాంలో రౌడీలు రెచ్చిపోతున్నారన్నారు. రౌడీల తోకలు కట్ చేస్తాం… జాగ్రత్త! అంటూ హెచ్చరించారు.
సమావేశం ముగిసిన తర్వాత కడప పెద్ద దర్గాను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బాబు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థన చేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..