Nagababu: నాగబాబుకు ఇచ్చే శాఖ అదేనా.. బాబు-పవన్ భేటీలో చర్చ..!
ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు.. ఇంతకీ ఏ బాధ్యతలు చేపట్టబోతున్నారు? గనుల శాఖా? సినిమాటోగ్రఫీనా? చంద్రబాబు -పవన్ భేటీలో క్లారిటీ వచ్చేసిందా? ఇద్దరి భేటీలో చర్చకొచ్చిన అంశాలేంటన్నది రాజకీయంగా ఆసక్తిరేపుతోంది.
అమరావతి సచివాలయం బ్లాక్-1లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు. పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించడంతో ఈ భేటీపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. నాగబాబుకు ఏయే శాఖలు ఇవ్వాలి.. ముందుగా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలా? లేదంటే మంత్రి పదవి ఇచ్చాక ఎమ్మెల్సీని చేయాలా? అన్న అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ మూడు మంత్రి పదవులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రిగా ఉన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్.. సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ ఉన్నారు. ఇందులో సినిమాటోగ్రఫీ శాఖ లేదంటే గనుల శాఖ నాగబాబుకు ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహూర్తంతో పాటు నామినేటెడ్ పదవులపైనా చంద్రబాబు – పవన్ మధ్య చర్చ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. జనసేనకు సంబంధించి జాబితాను చంద్రబాబుకు పవన్ ఇచ్చినట్టు సమాచారం. ఏయే పోస్టులు జనసేనకు కేటాయించాలనే దానిపై త్వరలోనే ఓ లెక్క తేలే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్య సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి.. బంపర్ విక్టరీ నమోదు చేసిన క్రమంలో రాబోయే సహకార ఎన్నికల్లోనూ ఇదే తరహా సమన్వయం కొనసాగించాలని ఇరు పార్టీల అధినేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. గత రెండు నెలల వ్యవధిలో ఇద్దరు నేతలు భేటీ కావడం ఇది మూడోసారి. దాదాపు 40నిమిషాల పాటు భేటీ జరిగింది. కానీ ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి