చిత్తూరులో దారుణం జరిగింది. వేలూరు రోడ్డులోని ఆనంద ధియేటర్ వద్ద బ్యూటీ పార్లర్ నడుపుతున్న ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. యువతి మృతిదేహం పక్కనే ఓ యువకుడు రక్తపు మడుగులోపడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కొన ఊపిరితో ఉన్న యువకుడికి ప్రాథమిక చికిత్స చేయించి ఆసుపత్రికి తరలించారు. కానీ.. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్ట్‌మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
చిత్తూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగరాజు కుమార్తె దుర్గా ప్రశాంతికి.. కొన్ని నెలల కిందట ఫేస్ బుక్ ద్వారా భద్రాద్రి జిల్లాకు చెందిన చక్రవర్తి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో చక్రవర్తి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. అయితే.. రెండు నెలల కిందట చక్రవర్తి తన కుటుంబంతో కలిసి చిత్తూరులోని దుర్గా ప్రశాంతి ఇంటికి దగ్గరే ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. దాంతో.. ఇరు కుటుంబాల మధ్య పరిచయం బాగా పెరిగినట్లు తెలుస్తోంది.
ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఏం జరిగిందో ఏమో గానీ మంగళవారం సాయంత్రం.. తాను నడుపుతున్న బ్యూటీ పార్లర్ యువతి విగత జీవిలా పడి ఉంది. ఆమె మృతదేహం ప్రక్కనే చక్రవర్తి రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతుండడాన్ని ఆమె గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. యువతిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యూటీషియన్ హత్య కేసును చేధించే పనిలో పడింది క్లూస్ టీమ్. ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారా?.. లేక.. చక్రవర్తి ముందుగా దుర్గా ప్రశాంతిని నొంతు నులిమి హత్య చేసి.. ఆపై.. తానూ బ్లేడ్‌తో చేయి, గొంతు కోసుకున్నాడా అనే కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిన నేపథ్యంలో దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..