
ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ప్రాంతాల్లో ముస్తాబు కార్యక్రమానికి మొదట శ్రీకారం చుట్టారు జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి. గత మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి కలెక్టర్ ప్రభాకర రెడ్డి విస్తృతంగా గిరిజన చిన్నారుల పిల్లల జీవన పరిస్థితులను చూసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, ఎస్టీ హాస్టల్స్‌ను సందర్శించారు. వారిని దగ్గర నుంచి గమనించారు. వారిలో దుస్తులు సరిగా లేని చిన్నారులు కొందరు ఉంటే, తల దువ్వుకోవడం కూడా తెలియని అమాయక గిరిజన బిడ్డలు మరికొందరు ఉన్నారు. అంతేకాకుండా మరికొందరు చిన్నారులకు శుభ్రత, పరిశుభ్రత విషయంలో అవగాహన కూడా లేకుండా అమాయకంగా కనిపించారు. వారిని చూసి చలించిన కలెక్టర్ ప్రభాకర రెడ్డి వారికి శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించి అందమైన చిన్నారులులా ముస్తాబు చేయాలని నడుం బిగించారు. అనుకున్నదే తడవు వెంటనే కార్యరూపం దాల్చే విధంగా అడుగులు వేశారు. పెద్ద ప్రాజెక్టులకన్నా చిన్న మార్పులే నిజమైన విప్లవాన్ని తెస్తాయని నమ్మిన కలెక్టర్ ముస్తాబు పథకంను ఆవిష్కరించారు. సాధారణంగా కనిపించే జుట్టు, గోళ్ల శుభ్రత నుంచి పిల్లల ఆత్మవిశ్వాసం వరకు ప్రతిదీ ఈ కార్యక్రమంలో భాగమైంది.
ముస్తాబు కార్యక్రమం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే చిన్నారుల్లో విప్లవాత్మక మార్పు!
ముస్తాబు అమలుతో అంగన్వాడీ కేంద్రాల ముఖచిత్రమే మారిపోయింది. ఆటలతో కూడిన విద్య, కథలు, పాటల ద్వారా పిల్లలను చదువుతో మమేకం చేశారు. పిల్లల్లో ఆటా పాటలు పెంచారు. చదువుకోవడానికి ఇష్టపడని విద్యార్థులు సైతం ఆటా పాటల కోసం స్కూల్స్‌కి రావడం ప్రారంభించారు. పోషకాహారం, ఆరోగ్య పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇచ్చి, తల్లిదండ్రులను కూడా భాగస్వాములును చేశారు. పిల్లల రోజువారీ అలవాట్లలో క్రమంగా వచ్చిన మార్పులు ఈ పథకానికి బలమైన మార్పుకు శ్రీకారం చుట్టారు. గిరిజన ప్రాంతాల్లో కనిపించిన స్పష్టమైన ఫలితాలు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమం వల్ల అంగన్వాడీ కేంద్రాలకు హాజరు పెరిగింది, పిల్లల్లో పరిశుభ్రత అలవాట్లు మెరుగుపడ్డాయి, చదువుపై ఆసక్తి పెరిగింది. చిన్న స్థాయిలో మొదలైన ఈ ప్రయోగం ప్రభావవంతమైన గవర్నెన్స్ మోడల్‌గా మారింది.
ముఖ్యమంత్రి మెచ్చిన ముస్తాబు
పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన విద్యార్థుల్లో వచ్చిన ఈ విజయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముస్తాబు పథకాన్ని రూపకల్పన చేసిన కలెక్టర్ ప్రభారకర రెడ్డిని కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో బహిరంగంగా మెచ్చుకున్నారు. పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక జిల్లా నుంచి ప్రారంభమైన ఆలోచన, రాష్ట్ర స్థాయి విధానంగా మారే దిశగా అడుగులు వేస్తుందని ప్రశంసించారు. వెంటనే ముస్తాబు అనేది ఒక మంచి కార్యక్రమం మాత్రమే కాదని, ఈ ఆలోచనతో చిన్నారుల జీవితాల్లో క్రమశిక్షణ, ఆరోగ్యం, విద్య అనే మూడు బలమైన స్థంభాలను నిలబెట్టే ప్రయత్నమని అన్నారు. ఈ ముస్తాబు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరగాలని పిల్లల్లో శుభ్రత. ఆత్మవిశ్వాసం పెంచేలా పక్కాగా అమలు చేయాలని విద్యాసంస్థలకు ఆదేశాలు ఇచ్చారు. అలా గిరిజన గడ్డ నుంచి మొదలైన ముస్తాబు కార్యక్రమం మోడల్ గవర్నెన్స్ గా మారి పిల్లల భవిష్యత్తులకు నిజమైన ముస్తాబు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..