AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు! – ఆచారాలకు భిన్నంగా ముద్రగడ తీసుకున్న సంచలన నిర్ణయాలు!

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణంతో ఆయన రాజకీయ జీవితం మాత్రమే కాదు, జీవితాంతం పాటించిన విలక్షణమైన ఆలోచనలు కూడా చర్చనీయాంశమయ్యాయి. భార్య పసుపు, కుంకుమలు తీయొద్దని, తన భౌతికకాయాన్ని దహనం చేయకుండా ఇంటి ఆవరణలోనే సమాధి చేయాలని ఆయన ముందుగానే కోరిన విషయాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు! - ఆచారాలకు భిన్నంగా ముద్రగడ తీసుకున్న సంచలన నిర్ణయాలు!
Mudragada Padmanabham
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jul 15, 2026 | 3:16 PM

Share

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోనే కాకుండా తన వ్యక్తిగత నిర్ణయాల్లోనూ ఎంతో నిబద్ధతతో, సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చేలా నడుచుకుంటారు. సాంప్రదాయాలు, ఆచారాల పేరుతో సమాజంలో జరిగే కొన్ని విషయాలపై ఆయనకు స్పష్టమైన, విలక్షణమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆయన తదనంతరం నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి తన అనుచరులకు ఆయన బ్రతికి ఉన్నప్పుడే వివరించారట. సాంప్రదాయాలకు భిన్నంగా ఉన్న ఆ కోరికలు ఏమిటో మీరుతెలుసుకోండి.

భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు!

సాధారణంగా భర్త చనిపోయిన తర్వాత మహిళల పసుపు, కుంకుమలు తీసేయడం హిందూ సంప్రదాయంలో వస్తున్న ఒక సాంప్రదాయం. కానీ ముద్రగడ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. “ నేను చనిపోయినప్పటికీ నా భార్య పసుపు, కుంకుమలు తీయకూడదు. ఆమె ఎప్పటిలాగే బొట్టు పెట్టుకుని మంగళప్రదంగా ఉండాలి” అని ఆయన స్పష్టం చేశారు. చిన్నతనం నుంచి ఆమెకు ఉన్న పసుపు కుంకుమ తన మరణం కారణంగా ఆమెకు దూరం కావటం భావ్యం కాదని ఆయన చెప్పారట. మహిళల ఆత్మగౌరవాన్ని, వారి భావోద్వేగాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

దహనం వద్దు.. ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాలి!

సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని దహనం (తగలబెట్టడం) చేస్తారు. కానీ ముద్రగడ గారు దీనికి భిన్నమైన కోరికను కోరారు. తన భౌతిక కాయాన్ని కాల్చకూడదని, తన సొంత ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాలని (సమాధి చేయాలని) ఆయన కోరారు. నిరంతరం తన కుటుంబానికి, తన ఊరికి దగ్గరగానే ఉండాలనే భావన లేదా ప్రకృతిలో లీనమవ్వాలనే ఉద్దేశం ఇందులో కనిపిస్తుంది. పుట్టిన మట్టిలోనే కలిసి పోవాలనే ఆయన ఆలోచనలకు అనుగుణంగా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ఉన్న మామిడి చెట్టు కింద అంత్యక్రియల ఏర్పాట్లు చేసారు.

సమాజం ఏమనుకుంటుంది అనేదాని కంటే, తన మనస్సాక్షికి ఏది సరైనది అనిపిస్తే అది చేయడమే ముద్రగడ పద్మనాభం శైలి. సాంప్రదాయాల పేరుతో జరిగే కొన్ని ఆచారాలను పక్కన పెట్టి, ఆయన కోరిన ఈ మూడు కోరికలు సమాజంలో సరికొత్త చర్చకు, ఆలోచనకు దారితీశాయి.

కాపు ఉద్యమనేత, ప్రముఖ నాయకుడు ముద్రగడ పద్మనాభం మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభానికి బంధువులు, కాపు సామాజికవర్గ ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, అభిమానులు నినాళి అర్పించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా ప్రజా జీవితంలో సేవలు అందించారు ముద్రగడ.

– 1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ జన్మించారు. 1967లో మెట్రిక్యులేషన్‌ పూర్తిచేశారు. పద్మనాభం తండ్రి వీర రాఘవరావు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 1962, 1967లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ్యునిగా గెలుపొందారు. 1977లో తండ్రి ఆకస్మిక మృతితో, సన్నిహితుడైన అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సూచనతో 25వ ఏట ముద్రగడ జనతాపార్టీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించారు.

– ప్రత్తిపాడు నుంచి 1978లో జనతాపార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ముద్రగడ గెలుపొందారు. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీచేసి శాసనసభ్యునిగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆకస్మికంగా పదవికి రాజీనామా చేశారు. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీతో కలిసి కత్తిపూడిలో బహిరంగ సభ పెట్టి ముద్రగడ.. కాంగ్రెస్‌లో చేరారు. 1989లో ఆ పార్టీ తరఫున గెలిచి మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1994లో ప్రత్తిపాడు నుంచి బరిలో దిగి ఓటమి చవిచూశారు. 1999లో తెదేపాలో చేరి కాకినాడ నుంచి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు. 2004లో మరోసారి ఎంపీగా పోటీచేసినా ఓడిపోయారు. 2009లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడారు. అప్పటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబు ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కాగా కుమార్తె క్రాంతి జనసేన నాయకురాలిగా ఉన్నారు.

– కాపులను బీసీల్లో చేర్చాలంటూ ముద్రగడ ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. 2016లో తుని వేదికగా కాపు ఐక్య గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న రైలు దహనం ఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది.

Follow Us