వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. వారం రోజుల్లో భాగంగా మొదటిరోజు పలు కీలక విషయాలపై ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించింది. బుధవారం (ఏప్రిల్ 19) విచారణలో అవినాష్ విచారణలో పలు కీలక అంశాలు రికార్డు చేశారు సీబీఐ అధికారులు. వైఎస్ వివేకానందారెడ్డి మర్డర్ కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్‌రెడ్డి.. వారంపాటు ప్రతిరోజు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో.. బుధవారం విచారణకు హాజరుకాగా.. సీబీఐ అధికారులు దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డి విచారణకు సంబంధించిన విషయాలు టీవీ9 చేతికి చిక్కాయి. అవినాష్‌రెడ్డి వ్యక్తిగత, రాజకీయ విషయాలపై సీబీఐ వివరాలుసేకరించింది. ఆయన్ను ప్రశ్నించేందుకు సీబీఐ ముందుగానే ప్రశ్నలు సిద్ధం చేసుకోగా.. అధికారులు అడిగిన ప్రతి క్వశ్చన్‌కు ఆన్సర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవినాష్‌రెడ్డి చెప్పిన సమాధానాలను ల్యాప్‌టాప్‌లో ఎంట్రీ చేశారు సీబీఐ అధికారులు. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో ఫార్మాట్‌లో రికార్డ్ చేశారు. అయితే.. ఈ విచారణలో.. వివేకానందారెడ్డి హత్య జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది..?, అక్కడికి ఏ సమయానికి వెళ్లారు..?, నిందితులు భాస్కర్‌రెడ్డి ఇంటికి రావడానికి కారణాలేంటి..? అనే అంశాలపైనే సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. వివేకా హత్య కేసులో అరెస్టు అయిన అవినాష్ తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని కూడా సీబీఐ అధికారులను విచారించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌లను CBI కార్యాలయానికి తరలించారు. వీరిద్దర్నీ దాదాపు ఐదున్నర గంటలపాటు ప్రశ్నించారు. వివేకా హత్యకు దారితీసిన కారణాలు, హత్యకు గురైతే గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారనే దానిపైనే ప్రధానంగా విచారణ సాగినట్లు తెలుస్తోంది. అటు.. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి చెప్పిన సమాచారం ఆధారంగానే ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించినట్లు టాక్ వినిపిస్తోంది. ముగ్గురిని కలిపి గంటన్నరపాటు విచారించినట్లు కూడా తెలుస్తోంది. ఇక.. విచారణ తర్వాత వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు.
మొత్తంగా.. వివేకా హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్‌రెడ్డి ఈ నెల 25 వరకు ప్రతిరోజు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు మళ్లీ విచారణకు రావాలని సీబీఐ అధికారులు సూచించారు. దాంతో.. విచారణకు హాజరుకానున్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి. ఇక.. వారం రోజుల సీబీఐ విచారణ రిపోర్ట్ ఆధారంగా అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై తుది తీర్పు ఇవ్వనుంది తెలంగాణహైకోర్టు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..