
ప్రకాశం జిల్లా దోర్నాల గ్రామానికి సమీపంలో ఉన్న నల్లమల అడవిలో ఓ చెట్టుకింద నంది విగ్రహం, కొన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి… అడవిలో తిరుగుతున్న చెంచు గిరిజనులు వీటిని చూశారు. ఓ రాయిపై ఏవో అక్షరాలు చెక్కి ఉండటాన్ని గమనించి ఫోటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఇవేంటో చెప్పుకోండి చూద్దాం అంటూ పజిల్ విసిరారు… సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలను చారిత్రక పరిశోధకులు తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ చూసి వీటిని రాజుల కాలంలో రాతిపై చెక్కిన శాసనాలుగా గుర్తించారు… ఈ రాయిపై చెక్కిన అక్షరాలు శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి లిపిగా గుర్తించారు… ఈ ఫోటోలను భారత పురావస్తు అధికారులకు పంపించారు… అక్కడ వాటిని పరిశీలించి ఇవి 1518 సంవత్సరం నాటివని నిర్ధారించారు.
విజయనగరాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణదేవరాయల కాలంలో శ్రీశైలంలో నిత్య పూజలతో అంగరంగ వైభవంగా అలరారుతుండేది. పూర్వం శ్రీశైలం వెళ్లాలంటే కాలినడకన పోవాల్సిందే. దట్టమైన నల్లమల అడవిలో క్రూరమృగాలతో సావాసం చేస్తూ రాత్రింబవళ్లు నడుచుకుంటూ యాత్రికులు శ్రీపర్వతం చేరే వాళ్ళు. ఆ సమయంలో గుంపులు గుంపులుగా వెళ్లే భక్తులకు ఆహారం నీరు అంతగా లభించేది కాదు. ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకుని వెళ్లేవారు. కానీ నీరు మాత్రం దొరికేది కాదు. ఆ సమయంలో చాలామంది వీరశైవ భక్తులు పుణ్యం కోసం బాటసారులకు సహాయం చేసేవారు. బావులు త్రవ్వించడం, సత్రాలు నిర్మించడం, జంతువుల బారి నుంచి రక్షించడం, దారిదోపిడీ దొంగల నుంచి కాపాడటం వంటివి చేసేవారు. అలా ఓ మహానుభావుడు ఓ బావి తవ్వించి అక్కడ ఒక శాసనం వేయించాడు… అదే ఇప్పుడు గిరిజనులు గుర్తించి వెలుగులోకి తీసుకువచ్చారు.
శాసనంలో ఏముంది…
శక సంవత్సరం 1440 (క్రీ.శ. 1518)లో ఈ శాసనం లిఖించబడింది… జ్ఞానంలో ధనవంతుడు, సిద్ధ భిక్షావృత్తి అయ్యవారి శిష్యులు కెమిదేవుని ఇమ్మడి లింగయ్య గారి స్నేహితుడు వెలగా పార్వతి నాయిని ఈ శాసనం వేయించారు… శ్రీశైల స్వామి వారికి, తమ గురువులు కెమిదేవునివారికి, తమ స్వామి ఇమ్మడి లింగయ్యగారికి, తన తల్లిదండ్రులు తమ్మినేని సిద్దమ్మకు, తన పెద్ద భార్య యెల్లమ్మకు పుణ్యంగా శ్రీశైలం కాలిబాటన వెళ్లే భక్తుల కొరకు బావి త్రవించారు… దాని చుట్టూ కలజు (అరుగు) కట్టించి ఈ పరిసరాల్లో లభించే నిధి, నిక్షేపాలు మొత్తం శ్రీశైలం శ్రీ మల్లికార్జునస్వామి వార్లకు అంకితం చేస్తున్నట్టు లిఖించారు. శ్రీపర్వత మల్లికార్జునదేవుని సేవకు వచ్చే వారి కోసం బావులు, సత్రాలు నిర్మించడం ఆనాటి కాలంలో పుణ్యంగా భావిస్తారు.
Inscription Photo
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..