Andhra Pradesh Weather: ప్రస్తుతానికి ఇది వానకాలం..! రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవాలి.. వర్షాలు లేకుంటే చల్లటి వాతావరణం ఉండాలి. కానీ.. వేడి, ఉక్కపోత వేసవిని తలపిస్తోంది. ఎండలు సాధారణ కంటే ఎక్కువ నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితులు ఇంకెన్నాళ్లు..? నిపుణులు ఏమంటున్నారు..? సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ నెల ఆఖరి వరకు వర్షాల సీజన్. దీన్నే రుతుపవనాల సీజన్ కూడా అంటుంటారు. వేసవి తర్వాత చల్లని తొలకరి పలకరిస్తే.. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నట్టు.. ఆ తర్వాత నైరుతి నిష్క్రమించినా ఈశాన్య రుతుపవనాలు చల్లదనాన్ని ఇస్తాయి. ఇది నవంబర్ వరకు కొనసాగే ప్రక్రియ. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విచిత్ర వాతావరణం కనిపిస్తుంది. చాలాచోట్ల ఎండ వేడి, ఉక్కపోత.. మరికొన్నిచోట్ల చదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఉదయాన్నే దట్టంగా పొగ మంచు చల్లటి శీతల వాతావరణం తలపించేలా ఉంటుంది. ఆ తర్వాత యధావిధిగానే పరిస్థితులు.
అయితే.. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఎండలు మంట పుట్టిస్తున్నాయి. కోస్తా తీరప్రాంతాల్లో అయితే ఉక్కపోత ఊకిరి బిక్కిరి చేస్తోంది. కొన్ని చోట్ల అయితే బయటకు రావాలంటేనే జనం ఎండవేడికి భయపడిపోతున్నారు. బుధవారం నాడు ఏపీలో చాలాచోట్ల 35 డిగ్రీలకు పైగా టెంపరేచర్ రికార్డు అయింది. గుంటూరు 37, కాకినాడ, కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు విజయనగరం విశాఖపట్నం 36 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద.
రుతుపవనాల సీజన్లో వేడి పెరగడానికి కారణాలు సర్వసాధారణమే అంటున్నారు నిపుణులు. కాకపోతే ఈసారి భిన్న పరిస్థితులు ఎండలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడానికి కారణాలుగా చెబుతున్నారు. ఎందుకంటే.. నైరుతి రుతుపవనాల తిరోగమనం మందగించింది. దీనికి తోడు వాయువ్య దిశ నుంచి వస్తున్న గాలులు పొడి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు కారణమని అంటున్నారు విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద. వీటన్నిటితో పాటు.. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాలకు ముందు వర్షాలకు బ్రేక్ పడే సీజన్ గా చెబుతున్నప్పటికీ.. ఈసారి పరిస్థితుల్లో కాస్త భిన్నంగానే ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
అయితే ఈ పరిస్థితిలో మరికొన్ని రోజులు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నెరతి రుతుపవనాలు నిష్క్రమణా మందగించింది. దీంతో ఈశాన్య రుతుపవనాల రాకపై ప్రభావం పడుతోంది. నైరుతి ఎంత త్వరగా నిష్క్రమిస్తే.. బంగాళాఖాతం వైపు నుంచి వచ్చే ఈశాన్య రుతుపవనాలు చల్లదనాన్ని వర్షాలను తెచ్చిపెడతాయి.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..