Tuni: ఆ ఇంట అమ్మ ఆవేదనే మిగిలింది.. ‘జానూ… నువ్వెక్కడ ఉన్నావురా?’
27 రోజులుగా జాహ్నవి కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. తన కూతురిని ఎవరైనా తీసుకెళ్లి ఉంటే సురక్షితంగా తిరిగి అప్పగించాలని, ఎలాంటి కేసులు పెట్టబోమని తల్లి భవానీ కన్నీటి విజ్ఞప్తి చేశారు.

27 రోజులుగా ఆ ఇంట్లో నవ్వులు లేవు.. అమ్మ అని పిలిచే చిన్నారి గొంతు వినిపించడం లేదు. ప్రతి క్షణం గుమ్మం వైపు చూస్తూ, ‘నా జానూ తిరిగి వస్తుంది’ అనే ఆశతో ఆ తల్లి ఎదురుచూస్తోంది. కాకినాడ జిల్లా తుని మండలం సి. ఆగ్రహారానికి చెందిన రెండున్నరేళ్ల జాహ్నవి అదృశ్యమై దాదాపు నెల గడిచినా ఆచూకీ దొరకకపోవడంతో, తన బిడ్డను తిరిగి అప్పగించాలని తల్లి భవానీ కన్నీటి విజ్ఞప్తి చేశారు.
తన కూతురు ఎక్కడ ఉందో తెలిసిన వారు దయచేసి చెప్పాలని తల్లి భవానీ వీడియో ద్వారా వేడుకున్నారు. ‘ఎవరైనా పొరపాటున కానీ, కావాలని కానీ నా బిడ్డను తీసుకెళ్లి ఉంటే… దయచేసి ఆమెను సురక్షితంగా మాకు అప్పగించండి. ఎలాంటి కేసులు పెట్టం… చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా చూస్తాం. మా పాపను మాత్రమే మాకు ఇచ్చేయండి’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
జాహ్నవి జీడిమామిడి తోటల సమీపంలో అదృశ్యమవడంతో పోలీసులు, అటవీ శాఖ, ఇతర విభాగాల సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇంతకాలం గడిచినా ఒక్క ఆధారం కూడా లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
చిన్నారి కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జాహ్నవి ఫొటోలతో మిస్సింగ్ పోస్టర్లు విడుదల చేయడంతో పాటు, ఆమె ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించారు. ఒక చిన్నారి కోసం తల్లి కళ్లలో ఆగని కన్నీరు.. తండ్రి మనసులో తీరని ఆవేదన.. ఆ కుటుంబం గుండెల్లో మిగిలిన ఆశ ఒక్కటే. జానూ.. నువ్వు క్షేమంగా తిరిగి రావాలి. ఆ బుబ్జి తల్లి క్షేమంగా ఉండి.. ఆ తల్లి ఒడికి చేరాలని మీరు ప్రార్థించండి..
