Guntur: బంగారాన్ని పాత చీరలో మూటకట్టిన బామ్మ.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్

గుంటూరు జిల్లాకు మున్నంగికి చెందిన బామ్మ దొంగల భయంతో.. బంగారాన్ని పాత చీరలో చుట్టేసింది. ఆ విషయం మర్చిపోయి పాత చీరలు అన్నింటిని ఓ చిరు వ్యాపారికి అమ్మేసింది. సాయంత్రానికి బంగారం విషయం గుర్తుకువచ్చి... పరుగు పరుగున పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ తర్వాత...

Guntur: బంగారాన్ని పాత చీరలో మూటకట్టిన బామ్మ.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
Gold (Representative image)

Edited By:

Updated on: Mar 29, 2025 | 4:30 PM

అది గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామం… మధ్యాహ్న సమయంలో పాత చీరెలు, బట్టలు కొనుగోలు చేసేందుకు చిరు వ్యాపారి వచ్చాడు. గ్రామంలో తిరుగుతున్న సమయంలో కర్రె వెంకట సుబ్బమ్మ తన ఇంటిలో ఉన్న పాత చీరెలను ఆ వ్యాపారికి ఇచ్చేసింది. పాతచీరెల కొనుగోలు చేసిన వ్యక్తి ఆమెకు ముట్ట చెప్పాల్సింది చెప్పేసి అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. వెంకట సుబ్బమ్మ తనకున్న 56 గ్రాముల బంగారు ఆభరణాలు ఎవరికి తెలియకుండా పాత చీరెలోనే మూట కట్టి పెట్టుకుంది. ఆ విషయం ఆ తర్వాత మర్చి పోయింది. పాత చీరెల కొనుగోలు చేసే వ్యాపారి వచ్చినప్పుడు బంగారు ఆభరణాలు పాత చీరెలో మూట గట్టిన విషయం మర్చిపోయి చీరెలు అతనికి ఇచ్చేసింది.

సాయంత్రం బంగారు నగలు మూట గట్టిన పాత చీరె కూడా వ్యాపారికి ఇచ్చేసిన విషయం గుర్తుకొచ్చిన వెంకట సుబ్బమ్మ వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గ్రామంలోని సిసి కెమెరా విజువల్స్ పరిశీలించారు. చీరెలు కొనుగోలు చేసిన వ్యాపారి తెనాలికి చెందిన తాడిశెట్టి సాంబశివరావుగా గుర్తించారు. వెంటనే అతన్ని సంప్రదించేందుకు తెనాలి వెళ్లారు. అయితే అప్పటికే ఆ చీరెల మడతలు విప్పిన వ్యాపారి సాంబశివరావు అందులో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించాడు. వాటిని జాగ్రత్త చేసి పోలీసుల వద్దకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. అదే సమయంలో పోలీసులు రావడంతో రెండు బంగారు గాజులు, ఒక గొలుసును వారికి అప్పగించాడు. వాటిని తీసుకున్న పోలీసులు వెంటనే కొల్లిపర వెళ్లి ఆమెకు అప్పగించారు. తన బంగారు ఆభరణాలు తనకు అప్పగించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన పోలీసులను పలువురు ప్రశంసించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..