శతాబ్దాలుగా చేనేత రంగానికి.. ముఖ్యంగా పట్టు చీరల ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర జౌళి, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తన లేఖతో జతపర్చారు. దానిని పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. 30 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. ధర్మవరం హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటులో 80 శాతం మేర నిధులు కేంద్రం భరిస్తే, మిగిలిన 20 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని లేఖలో వివరించారు.
యాంత్రిక యుగంలో పవర్‌లూమ్స్ విపరీతంగా పెరిగిపోతుండటంతో ధర్మవరం సంప్రదాయ పట్టు చీరల తయారీ రంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుందన్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోతుందని తెలిపారు. చేనేతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సవాళ్ళ ఊబిలో చిక్కుకున్న ధర్మవరం చేనేత, పట్టు చీరల ఉత్పత్తి రంగాన్ని గాడిలో పెట్టేందుకు పలు ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు.
Met with Hon. Minister of Textiles & Handlooms, Shri Giriraj Singh ji, @girirajsinghbjp highlighting the urgent need for establishing a Handloom Cluster in my assembly constituency, Dharamavaram, Sri Satya Sai District, Andhra Pradesh.
– Dharamavaram is renowned for its… pic.twitter.com/ndysDieMq5
— Satya Kumar Yadav (@satyakumar_y) October 7, 2024
సత్యసాయి జిల్లా వ్యాప్తంగా దాదాపు 28,500 కుటుంబాలు, ప్రత్యేకంగా ధర్మవరం ప్రాంతంలో 12,800 కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని, చేనేత కార్మికుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకుని వారి జీవితాలను చక్కదిద్దేందుకు ఈ రంగంలో తగిన పోటీ తత్వాన్ని ప్రోత్సహించేందుకు తాను ప్రతిపాదించిన చర్యలు ఉపయోగపడతాయని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదిత హ్యాండ్లూమ్ క్లస్టర్ తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని… ఈ డీపీఆర్‌ను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..