Fee Reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఏమన్నారంటే?
ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థికసాయంపై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ..

అమరావతి, మార్చి 17: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వాస్తవాలను వినే పరిస్థితిలో వైసీపీ లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థికసాయంపై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుండటంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలుగచేసుకుని వైసీపీ సభ్యుల ఆరోపణలు తిప్పికొట్టారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగంపై శాసనమండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారు? ఈ విషయాలన్నీ ఆ రోజు చెప్పాం. మీరెందుకు బాయ్ కాట్ చేశారు? ఆ రోజు జరిగిన చర్చలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై చాలా స్పష్టంగా చెప్పాం. వినకుండా, చదవకుండా మళ్లీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నోట్ పంపిస్తాను.. ఒకసారి చదవాలి.
మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వాస్తవాలు చెబుతుంటే దానిని కూడా ఓర్చుకోలేక పోతున్నారు. వైసీపీ హయాంలో రూ.4,200 కోట్లు బకాయిలు పెట్టారు. అవునో, కాదో చెప్పాలి. వివరాలు పంపిస్తాం. స్కూల్ ఫీజు రీయింబర్స్ మెంట్, పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ వివరాలన్నీ అందులో ఉన్నాయి. 2019లో ఆనాటి ప్రభుత్వం పెట్టిన బకాయిలను 16 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలే అయింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కచ్చితంగా చెల్లిస్తాం. హౌస్ సాక్షిగా హామీ ఇచ్చాం. చర్చలో వైసీపీ సభ్యులు లేకపోతే నేనేం చేయగలను.
బీఏసీలో విద్యారంగంపై చర్చ కావాలని అడిగితే ఒప్పుకున్నాం. కానీ ఆ చర్చకు వైసీపీనే లేదు. వాస్తవాలు వినడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఇచ్చిన వివరాలు పూర్తిగా చదవాలని మంత్రి లోకేష్ సూచించారు. విద్యార్థుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడిందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. వసతి దీవెన ఏనాడు సక్రమంగా చెల్లించలేదని మండిపడ్డారు.