జగన్ సర్కార్‌ను మరోసారి టార్గెట్ చేశారు జనసేనాని. ప్రతిపక్ష నేతలు వస్తే గాని ధాన్యం కొనుగోలు చేయరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసుంటే రైతులకు ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్ కల్యాణ్… అండగా ఉంటామంటూ అన్నదాతలకు అభయమిచ్చారు. అయితే, జనసేనాని టూర్‌పై వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లే పడ్డాయ్. అతనో అజ్ఞాని అంటూ సెటైర్లేశారు వ్యవసాయశాఖా మంత్రి కాకాని.
అన్నదాతలకు అండగా ఉంటామన్నారు పవన్ కల్యాణ్. తూర్పుగోదావరి జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆయన, ప్రతి గింజా కొనే వరకూ జనసేన పోరాటం చేస్తుందన్నారు. కడియం ఆవ, రాజుపాలెం, కొత్తపేట, ఆవిడిలో రైతులతో నేరుగా మాట్లాడారు. పొలాల్లోకెళ్లి దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యాన్ని చెక్ చేశారు.
మొలకలు వచ్చిన ధాన్యాన్ని పవన్‌కు చూపించి కన్నీళ్లు పెట్టుకున్నారు అన్నదాతలు. ధాన్యం కొనుగోళ్లలోనూ అవకతవకలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇక, జనసేనాని టూర్‌తో అధికారులు హడావుడిగా కొనుగోలుచేసి లారీల్లో లోడ్‌చేసిన ధాన్యాన్ని సైతం చూపించారు. దాంతో, అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతు పక్షాన జనసేన పోరాడుతుందని భరోసా కల్పించారు పవన్.
ప్రతిపక్ష నేతలు వస్తే గాని ధాన్యం కొనుగోలు చేయరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జనసేనాని. ప్రభుత్వం ముందే మేల్కొని ఉంటే, రైతులకు ఇంత నష్టం జరిగి ఉండేదే కాదన్నారు. పవన్ కామెంట్స్‌పై సెటైర్లు వేశారు వ్యవసాయశాఖ మంత్రి కాకాని. పది పంటలు చూపిస్తే ఐదింటిని కూడా గుర్తు పట్టలేనోళ్లు మాపై విమర్శలు చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు.
జనసేనాని పర్యటనతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయ్. పవన్ టూర్‌తో రాత్రికి రాత్రే అలర్టైంది రూలింగ్ పార్టీ. ఒకవైపు హడావిడిగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతూ, ఇంకోవైపు వ్యవసాయశాఖా మంత్రి కాకానిని సీన్‌లోకి దింపింది. దాంతో, పవన్ కామెంట్ చేయడమే ఆలస్యం వెంటనే కౌంటర్ ఇచ్చేస్తున్నారు కాకాని. మరి, పవన్ టూర్ ఇవాళ కూడా కొనసాగనుండటంతో ఇంకెన్ని పొలిటికల్ డైనమేట్లు పేలతాయో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..