ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర – 2 హాట్ టాపిక్ గా మారింది. రైతుల పాదయాత్రకు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు మద్దతు ఇస్తుండగా.. మరి కొందరు మాత్రం మూడు రాజధానులతోనే వికేంద్రీకరణ సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని వికేంద్రీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా ఈ నెల 15న ‘విశాఖ గర్జన’ ర్యాలీ చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. వైజాగ్ లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి వైఎస్‌ఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. ఈ ర్యాలీకి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అమరావతి పాదయాత్రను టీడీపీ పాదయాత్రగా ఆయన అభి వర్ణించారు. విశాఖపట్నం ను పాలన రాజధానిగా చేస్తే వస్తే నష్టమేంటని బొత్స ప్రశ్నించారు.
ఇక్కడి ప్రజల మనోభావాలను అనుగుణంగా పని చేయాల్సి ఉంది. ఈ నెల 15న గర్జన ర్యాలీ నిర్వహిస్తున్నాం. అంబేడ్కర్ విగ్రహం నుంచి బీచ్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. దానికి అనుగుణంగా మనకు ఉన్న అన్ని అవకాశాలు క్రోడీకరించి, ర్యాలీని సక్సెస్ చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమంలో పార్టీ శ్రేణులన్నీ పాల్గొనాలి. అలాగే పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా తప్పనిసరిగా హాజరవ్వాలి. పార్టీ పరంగా కూడా అవసరం మేరకు మనమంతా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి. విశాఖలోని అన్ని వార్డులలో సమావేశాలు నిర్వహించాలి. రేపు (మంగళవారం) సమావేశాలు. ఎల్లుండి (బుధవారం) ప్రతి వార్డు సెంటర్‌లో మానవ హారాలు నిర్వహించాలి. ఇందులో పార్టీ నగర పెద్దలంతా పాల్గొనాలి.
– బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మంత్రి
కాగా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. వికేంద్రీకరణ పేరుతో వైసీపీ విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించేందుకే ఈ అంశాన్ని తెర పైకి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతితో అభివృద్ధి వికేంద్రీకరణ జరగదంటూ అబద్ధాలు చెబుతున్నారని, మూడేళ్లు నోరు విప్పని ధర్మాన.. మంత్రి పదవి రాగానే సీఎం మెప్పు కోసం మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పరిపాలన వికేంద్రీకరణకు నాంది పలికింది ఎన్టీఆర్ అని, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే చేసి చూపించింది చంద్రబాబు అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..