ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరూతూ పాదయాత్ర చేపట్టిన రైతులకు పొలిటికల్ హీట్ తగులుతోంది. ఈ పాదయాత్రకు విపక్ష, ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు ఇస్తుండగా.. అధికార పార్టీ నేతలు, మంత్రులు మాత్రం ఫేక్ పాదయాత్ర అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు రైతులు వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో మహాపాదయాత్ర – 2 పై మంత్రి అంబంటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజమైన రైతుల కంటే రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఈ యాత్ర మధ్యలోనే ఆగిపోతుందని జోస్యం చెప్పారు. ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర కాదా అని ప్రశ్నించారు. 40 రోజులుగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అమరావతి పాదయాత్ర చేశారని, రైతుల పేరుతో రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తున్నారని మంత్రి అంబటి మండిపడ్డారు. పాదయాత్రకు కలిగిన విరామం తాత్కాలికం కాదని, ఇది శాశ్వత విరామమని వ్యాఖ్యానించారు.
టెంపుల్స్‌కు వెళ్లాల్సిన యాత్ర నియోజకవర్గాల నుంచి ఎందుకు వెళుతున్నాయి. అమరావతి యాత్ర రాజకీయ పాదయాత్రగా తయారైంది. తెలుగుదేశం, జనసేన నాయకులు కలిపి చేస్తున్న పాదయాత్ర ఇది. అరసవల్లి సూర్యదేవాలయానికి వెళ్లే అర్హత మీకు లేదు. పాదయాత్రలో ఉన్నవాళ్లంతా రైతులు కాదు… దోపిడీ దొంగలు.
– అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి
మరోవైపు.. పోలీసుల తీరుకు నిరసనగా మహాపాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైతులు ప్రకటించారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకొని పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామన్నారు. కాగా అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామంచంద్రాపురం బైపాస్ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రైతులు విడిది చేసిన ఫంక్షన్ హాల్‌ను ఈ ఉదయాన్నే పోలీసులు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనే 600 మంది గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసులు కోరారు. దీంతో రైతులు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
అయితే పోలీసులు తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా పాదయాత్రను తాత్కాలికంగా విరామం చేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా పోలీసు, ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, ఎదురవుతున్న అవాంతరాలన్నింటినీ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని రైతులు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..