వాళ్లంతా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు. వ్యవసాయం చేసుకుని పొట్ట పోసుకుంటారు. వారానికి ఒకసారి జరిగే సంతలోకి వెళ్లి.. కావాల్సిన సరుకులు తెచ్చుకుంటారు. వాటిని నిల్వ చేసుకుని వినియోగిస్తారు. కూరగాయలు అయితే ఓకే.. మరి మాంసం నిల్వ ఉంచితే.? వాటిని వండుకుని తింటే.? గతంలో చాలా ఘటనలు జరిగినా.. పాపం ఆ గిరిజనం ఇంకా..
వివరాల్లోకెళ్తే.. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం మూలగరువులో ఫుడ్ పాయిజన్‌తో గిరిజనులు మంచాన పడ్డారు. 18 మంది గిరిజనులు తీవ్ర అఅస్వస్థతకు గురయ్యారు. కుళ్ళిన మాంసం తినడంతో వాంతులు, విరేచనాలతో డయేరియా బారినపడ్డారు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అలర్ట్ అయ్యారు. అంబులెన్స్‌లో ఆర్ వి నగర్ పిహెచ్‌సీకి తరలించి వైద్య సేవలందిస్తున్నారు.
ఆర్ వి నగర్ వైద్య సిబ్బంది వివరాల ప్రకారం.. పాంగి మల్లేశ్వరరావు (23),పాంగి అప్పారావు (55),పాంగి చిలకమ్మా (50),పాంగి మలితి (22),పాంగి జ్యోతి (20).. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. కొర్ర రామన్న (60),వంతల సుబ్బారావు (45),మర్రి కమల (50)ఈ ఎనిమిది మంది కాస్త సివియర్‌గా ఉంది. మిగత ఎనిమిది మంది వెంటనే కోలుకున్నారు. అస్వస్థతకు గురి అయిన వారందరిని డాక్టర్ సౌమ్య ఆధ్వర్యంలో వైద్యసేవలో పర్యవేక్షిస్తున్నారు. నిల్వ ఉంచిన మాంసాన్ని, సంతల్లో అమ్మే మాంసం సరిగా ఉడికించకుండా తింటే అనారోగ్యం బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్ సౌమ్య. గిరిజనులు అస్వస్థతకు గురవడంతో.. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.