AP Rains: ఏపీలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్..

ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..

AP Rains: ఏపీలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్..
Ap Rains

Updated on: Nov 01, 2022 | 6:40 PM

నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.

రేపు అల్లూరి సీతరామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, నంద్యాల,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు ఎల్లుండి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతరామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, వైయస్సార్, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరుజిల్లాలో పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. కావలి, వెంకటాపురం, కోవూరు, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట లో అత్యధికంగా వర్షాలు పడ్డాయి. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. తుఫాన్ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురియనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ అధికారులను అప్రమత్తం చేశారు.