
ఎత్తైన జామాయిల్ చెట్లు నిండిన అడవి ప్రాంతం. అక్కడికి గేదెలను తోలుకు వెళ్లిన వ్యక్తులు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. భయంతో వాళ్ళ కాళ్ళు, చేతులు వణికాయి. ముక్కు పుటాలు అదరగొడుతూ భయంకరమైన దుర్వాసన వెదజల్లుతున్న మహిళా మృతదేహం అక్కడ వారికి కనిపించింది. పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరు ఆ మహిళ.? ఇంత అటవీ ప్రాంతంలో ఎలా హత్యకు గురైందనే సమాధానాలు వెతకటం మొదలు పెట్టారు.
అసలేం జరిగిందంటే.. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం పరిధిలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉన్న ఘటన సంచలనం రేపింది. బాహ్య ప్రపంచానికి తెలిసే లోగానే మృతదేహం ఉబ్బి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. మృతదేహం గురించి ఎలాంటి ఆధారాలు లేకపోయినా సైన్టిఫిక్ ఆధారాలతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. పోలీసుల దర్యాప్తులో హతురాలు పామర్తి శిల్పారాణిగా తొలుత గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంకు చెందిన ఈమెకు వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. అతను చనిపోవడంతో ఆమె తన స్వగ్రామమైన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామం వచ్చింది. రామానుజపురం గ్రామానికి చెందిన యడ్లపల్లి గణేష్‌తో పరిచయం ఏర్పడింది. 19 ఏళ్ళ వయస్సు ఉన్న గణేష్‌కు తనకంటే ఆరేళ్ళు పెద్దదైన శిల్పారాణికి మధ్య సాన్నిహిత్యం క్రమక్రమంగా బలపడింది.
పామర్తి శిల్పారాణి(25)కి వివాహమై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త మరణించడంతో ఒంటరిగా ఉంటున్న ఆమె గణేష్ తనకు అండగా ఉంటాడని భావించింది. అయితే గణేష్(19) మాత్రం ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో శిల్పరాణి అతన్ని బెదిరించడం మొదలు పెట్టింది. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న గణేష్ ఒక పథకం ప్రకారం మర్లగూడెం అడవిలోకి తీసుకువెళ్లి ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. ఆమె వినకపోవడంతో ఒక జామాయిల్ కర్ర తీసుకుని తలపైన బలంగా కొట్టి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడ ఏ క్లూస్ దొరకకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని 48 గంటల్లో పట్టుకుని కోర్టుకు తరలించారు పోలీసులు.