TDP: అంతా పొత్తుల ఎత్తులేనా..? తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్ధాల పొత్తుల ప్రస్తానం సాగిందిలా..
భారతదేశంలో ఎన్నికల వ్యూహం మారుతోంది. ఒంటరిగా పోటీ చేసే ఆలోచన తగ్గుతోంది. పొత్తుల కోసం ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి.
భారతదేశంలో ఎన్నికల వ్యూహం మారుతోంది. ఒంటరిగా పోటీ చేసే ఆలోచన తగ్గుతోంది. పొత్తుల కోసం ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి. నలబై ఏళ్ల ప్రస్తానం పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ పొత్తులతోనే ఎక్కువగా గెలిచింది. పొత్తులు లేకుండా జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చింది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. ఎన్ని సార్లు విజయం సాధించింది. కొన్ని సార్లు పొత్తుల ఎత్తులు సఫలం కాలేదు. టీడీపీ ఏ పరిస్థితుల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చిందో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం..
తెలుగుజాతి ఆత్మ గౌరవం నినాదంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ. ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టడమే కాదు..మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్రంలో బలమైన నేతలైన మాజీ ముఖ్యమంత్రులు భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలను తొలి ఎన్నికల్లోనే ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎన్నికలకు పెద్దగా సమయం లేదు మిత్రమా అంటూ సెలవిచ్చారు అనుచరులు. కొత్త పార్టీ కావడంతో ఒంటరిగా పోటీ చేసేకంటే పొత్తులతో వెళితేనే ప్రయోజనం అనేది ఎక్కువ మంది చెప్పిన మాట. వారి ఆలోచనల నుంచే కాదు..తాను తీసుకున్న నిర్ణయం నుంచి పుట్టిందే తొలి పొత్తు.
తొలి పొత్తుల ఎత్తులు..
తెలుగుదేశం పార్టీ పెట్టాక ఉభయ కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎంలను సంప్రదించారు ఎన్టీఆర్. అప్పుడు ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తక్కువగా అంచనా వేసిన లెఫ్ట్ పార్టీలు మెజార్టీ సీట్లు అడిగాయి. మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 150 సీట్లు డిమాండ్ చేశాయి. అన్ని సీట్లు ఇవ్వడం ఎన్టీఆర్ కు సుతారం ఇష్టం లేదు. తాను అనుకున్న హామీలను అమలు చేయాలంటే, మెజారిటీ స్థానాలు కావాలనేది ఎన్టీఆర్ ఆలోచన. అందుకే ఇక లాభం లేదనుకుని జనతా పార్టీ గడప తొక్కారు ఎన్టీఆర్. నాలుగు పార్టీల కూటమితో ఏర్పడ్డ జనతాలోను అప్పటికే లుకలుకలు ఏర్పడ్డాయి. పొత్తులు పొసగలేదు. భారతీయ జనతా పార్టీతోను సంప్రదింపులు జరిపినా ప్రయోజనం లేదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టాలని భావించిన ఎన్టీఆర్ కు వారి నుంచి సరైన ఆదరణ లభించలేదు.
ఇందిర కోడలుతో పొత్తు..
ఇదే సమయంలో ఇందిరాగాంధీ కోడలు సంజయ్ గాంధీ సతీమణి మేనకా గాంధీ వైపు నుంచి పొత్తుపై సానుకూల సంకేతాలు వచ్చాయి. అత్త ఇందిరాగాంధీ తీరును వ్యతిరేకిస్తూ సంజయ్ విచార్ మంచ్ ను ఏర్పాటు చేశారు మేనకా. ఆ పార్టీని దేశమంతా విస్తరించాలనే ఆలోచనతో ఉన్న మేనకాగాంధీ ఏపీలో టీడీపీతో పొత్తుకు ఒప్పుకోవడం కీలక మలుపు. ఎన్టీఆర్ ప్రతిపాదించిన పొత్తుకు అంగీకారం తెలపడమే కాదు…ఐదు సీట్లల్లో పోటీ చేసింది సంజయ్ విచార్ మంచ్. పార్టీ పెట్టిన తొలి ఎన్నికలోనే సంజయ్ విచార్ మంచ్ లాంటి పార్టీతో జట్టు కట్టిన టీడీపీ మొత్తం 294 సీట్లకు గాను 289 స్థానాల్లో పోటీ చేసింది. మొత్తం 46.03 శాతం ఓట్లతో 201 సీట్లల్లో విజయభేరి మోగించింది. మరోవైపు సంజయ్ విచార్ మంచ్ ఐదు సీట్లల్లో పోటీ చేసి నాలుగింటిలో గెలిచింది. ఫలితంగా టీడీపీ కూటమికి 205 సీట్లు వచ్చాయి. పార్టీ పుట్టిన 9 నెలల కాలంలోనే అఖండ విజయం సాధించడం మాములు విషయం కాదు. ఒక చిన్న పార్టీతో పొత్తు కట్టిన తెలుగుదేశం ఆ తర్వాత కూడా అదే పంథాను అనుచరించింది. కొన్ని సార్లు పొత్తులు అనివార్యం కాగా..మరికొన్ని సార్లు బలం ఉన్నా పొత్తులకు దిగిందనే చెప్పాలి. తొలిగా టీడీపీతో పొత్తు పెట్టుకున్న సంజయ్ విచార్ మంచ్ పార్టీని కొనసాగించలేక బీజేపీలో చేరారు మేనకా గాంధీ. ఆ తర్వాత కేంద్ర మంత్రి కావడం వేరే సంగతి.
వరుసగా పొత్తులే…
ఏడాది తిరగకుండానే 1985లో వచ్చిన ఎన్నికల్లో ఇటు బీజేపీ అటు వామపక్షాలు రెండింటితోను రాష్ట్ర స్థాయిలో ఒక అవగాహనకు వచ్చింది టీడీపీ. మాజీ సిఎం నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడిచినా తిరిగి 2 వందలకు పైగా సీట్లు తెచ్చుకుంది టీడీపీ. ఇక 1989 వామపక్షాలతో పొత్తు పెటుకున్న టీడీపీ 74 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ గెలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓటు బ్యాంక్ 36.54 శాతం మాత్రమే.
1994లోను సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం. ఎన్నడూ లేని విధంగా 216 సీట్లు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ పెట్టాక అత్యధిక సీట్లు వచ్చింది అప్పుడే. మొత్తం 44.14 ఓట్ షేర్ తెచ్చుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఇక 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం. ఆ ఎన్నికల్లోను టీడీపీకి 180 సీట్లు, 43.87 శాతం ఓట్ షేర్ వచ్చింది. రెండుసార్లు గెలిచిన ఉత్సాహంతో మళ్లీ 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. కేవలం 47 సీట్లే టీడీపీకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ప్రజారాజ్యం దెబ్బ…
ఇక 2009 నాటికి బీజేపీకి దూరంగా జరిగింది టీడీపీ. ఇటు లెప్ట్, అటు టీఆర్ఎస్ తోను పొత్తులు పెట్టుకుంది. మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నా టీడీపీకి పరాజయం తప్పలేదు. టీడీపీకి ఆ ఎన్నికల్లో 92 సీట్లు, 28.12 ఓట్ల షేర్ వచ్చింది. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రముఖ నటుడు చిరంజీవి కొత్తగా పెట్టిన ప్రజారాజ్యం పార్టీ పోటీ చేయడంతో విపక్ష ఓట్లల్లో చీలిక వచ్చింది. అది కాంగ్రెస్ కు కలిసి రాగా..టీడీపీని దెబ్బతీసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 156 సీట్లు రాగా..ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయి.
విభజన తర్వాతను…
ఇక 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లోను పొత్తులు కొనసాగించింది టీడీపీ. 2014లో రెండు రాష్ట్రాల్లోను బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఏపీలో 175 సీట్లకు గాను..102 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. దాదాపు 45 శాతం ఓట్ షేర్ ను టీడీపీ సాధించింది.
పొత్తు లేకుండా…
ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోలేదు టీడీపీ. ఫలితంగా ఓటమి పాలైంది. తొలిసారి పొత్తు లేకుండా జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు రాగా…వైసీపీకి 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టీడీపీకి బలమైన దెబ్బ తగలగా…2019లో జనసేన పోటీతో టీడీపీ ఓటు బ్యాంక్ తగ్గింది. జనసేన ఒక్క సీటుకే పరిమితం అయినా టీడీపీకి కోలుకోని దెబ్బ తగిలింది.
ఇక తెలంగాణలో 2014లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో 21.77 శాతం ఓట్ షేర్ దక్కించుకుని తన ఉనికిని చాటుకుంది. కానీ అప్పటి నుంచి టీడీపీ తెలంగాణలో కనుమరుగవుతూ వస్తోంది. 2018 ఎన్నికల నాటికి టీడీపీ వ్యూహం మార్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. అయినా ఫలితంలో మార్పు లేదు. గతం కంటే దారుణంగా టీడీపీ ఓట్లు, సీట్లకు గండిపడింది. కేవలం రెండు సీట్లల్లోనే టీడీపీ గెలవగా…3.51 శాతం ఓట్ షేర్ ఆ పార్టీకి రావడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.
ఈ సారి ఏంటి…
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది? అసలు పొత్తు ఉంటుందా లేదా అనేది అంశం పై ఇంకా స్పష్టత లేదు. కానీ జనసేన, బీజేపీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకునే అంశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు ఆ పార్టీ తీరును గమనించిన రాజకీయ విశ్లేషకులు. పొత్తు లేకుండా కంటే ఉంటేనే గెలుస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
-కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు
Also Read..
Hyderabad: ఆన్‌లైన్‌లో మ్యాక్‌బుక్ ఆర్డర్ పెట్టిన యువకుడు.. పార్శిల్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే షాక్