Andhra News: 200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం.. ప్రత్యేకత ఏంటంటే?

మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ప్రముఖ వైష్ణవాలయంగా వెలుగొందుతుంది. ఇక్కడి ఆలయ గోపురం, ముఖ మండపం, కోనేరులకు ఎంతో చారిత్రక నేపధ్యం ఉంది. నాలుగు వందల ఏళ్ల క్రితమే ముఖ మండపం నిర్మించగా రెండు వందల ఏళ్ళ క్రితం గాలి గోపురాన్ని నిర్మించారు. ఇవే కాదు.. ఈ ఆలయంలో రెండు వందల ఏళ్ల నాటి ఎంతో ప్రసిద్ధి చెందిన శంఖం కూడా ఉంది. భక్తులు దాన్ని చూడాలంటే.. ఏడాదిపాటు వేచి చూడాల్సి ఉంటుంది.

Andhra News: 200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం.. ప్రత్యేకత ఏంటంటే?
Andhra News

Edited By: Anand T

Updated on: Dec 08, 2025 | 6:13 PM

శంఖాల్లో రెండు రకాలుంటాయి. ఒక వామవర్తి (ఎడమ వైపుకు తిరిగేది), రెండు దక్షిణావర్తి (కుడి వైపుకు తిరిగేది). వీటిని ఆకారాన్ని బట్టి వర్గీకరిస్తారు, కానీ వాటిని కామధేను, గణేశ, లక్ష్మీ, మణిపుష్పక వంటి అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. ముఖ్యంగా దక్షిణావర్తి శంఖం చాలా పవిత్రమైనదిగా, అరుదైనదిగా పరిగణించబడుతుంది. అలాగే ఈ దక్షిణావ్రుత శంఖానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి ఏటా వైష్ణవాలయాల్లో ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం రోజు మాత్రమే మనం ఈ శంఖాన్ని చూడవచ్చు.

ఎందుకంటే ఆరోజు దర్శనం తర్వాత దక్షిణావ్రుత శంఖులోనే భక్తులకు తీర్ధం ఇస్తారు. ఇలా ఇచ్చే తీర్థాన్ని తీసుకునేందుకు భక్తులు కూడా ఎంతో మక్కువ చూపుతారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎగువ ఉండే పానకాల స్వామి ఆలయంలో కూడా దక్షిణావ్రుత శంఖం ఉంది. అయితే దీనికి రెండు వందల నాలుగేళ్ళ చరిత్ర ఉంది. 1820లో ఈ శంఖాన్ని తంజావూరు మహారాజు రెండో సర్ఫోజీ స్వామి వారికి దర్శించుకున్న సందర్భంలో బహూకరించారు.

ఈ శంఖానికి బంగారు తొడుగు చేయించారు. అప్పటి నుండి ఈ శంఖం ద్వారానే ఏకాదశి రోజు తీర్థం ఇస్తుంటారు. ఈ శంఖం నుండి ప్రతి రోజూ ఓంకారం వినిపిస్తుందని అర్చకులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శన అనంతరం ఈ దక్షిణావ్రుత శంఖంతోనే అర్చకులు తీర్ధం ఇస్తారు. ఇలా తీసుకున్న తీర్ధం వ్యాధులు, దీర్ఘకాలిక బాధలు, గ్రహ ఇబ్బందులను తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రతి ఏటా ఏకాదశి రోజు మాత్రమే ఈ శంఖాన్ని బయటకు తీస్తారు. మిగిలిన రోజుల్లో బ్యాంక్ లాకర్ లో భద్రపరుస్తారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.